ప్ర‌కాశం: 3 రిజ‌ర్వ్‌డ్ సీట్ల‌లో గెలిచేదెవ‌రు.. ఓడేదెవ‌రు...?

RAMAKRISHNA S.S.
- టీడీపీ నుంచి సిట్టింగ్ సామి, విజ‌య్‌తో పాటు ఎరిక్ష‌న్ బాబుకు కొత్త‌గా ఛాన్స్‌
- వైసీపీలో మంత్రులు సురేష్‌, నాగార్జున‌కు స్థాన చ‌ల‌నం
- య‌ర్ర‌గొండ‌పాలెంలో ఎవ‌రు గెలిచినా ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యే అయిన‌ట్టే
( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మూడు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈసారి పోరు మామూలుగా లేదు. అధికార వైసీపీ ఇద్దరు మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జునకు స్థానచలనం చేసింది. గుంటూరు జిల్లాలోని వేమూరు నుంచి నాగార్జునను సంతనూతలపాడుకు బదిలీ చేసింది. అలాగే ఎర్రగొండపాలెం నుంచి ఆదిమూల‌పు సురేష్ ను కొండపికి పంపించారు. ఎర్రగొండపాలెంలో మాత్రం బాలినేని శ్రీనివాస్ రెడ్డి రికమండేషన్ మేరకు కొత్తగా తాటిపర్తి చంద్రశేఖర్‌కు సీటు ఇచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేష్ తొలిసారి విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే జిల్లాలో ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు రిజర్వుడు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఇప్పుడు మూడో రిజర్వ్ నియోజకవర్గం అయినా కొండపి నుంచి బరిలో ఉన్నారు. ఇక బాపట్ల జిల్లాలోని వేమూరులో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న మేరుగా నాగార్జునను.. సంతనూతలపాడు నుంచి పోటీ చేయిస్తున్నారు. విచిత్రం ఏంటంటే కొండపి సీటు ఆశించిన వరికూటి అశోక్ బాబును వేమూరుకి బదిలీ చేశారు. ఇక టీడీపీ విషయానికి వస్తే.. కొండపిలో గత రెండు ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్న డోల బాలా శ్రీ వీరాంజనేయ స్వామికి మరోసారి సీటు ఇచ్చారు. స్వామి లోకల్ కాగా.. మంత్రి సురేష్ నాన్ లోకల్ కావటం ఈ నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉండటం.. ఈసారి గట్టి పోటీ నెలకొంది.

టీడీపీ వాళ్లు మాత్రం స్వామి హ్యాట్రిక్ విజయం ఖాయం అన్న ధీమాతో ఉన్నారు. సంతనూతలపాడులో గత రెండు ఎన్నికల్లోను ఓడిపోయిన బిఎన్‌. విజయ్ కుమార్ పై ఈసారి సానుభూతి ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి తోడు ఎక్కడో గుంటూరు జిల్లా నుంచి వలస వచ్చిన నాగార్జునకు స్థానిక వైసీపీ క్యాడర్ ఎంతవరకు ?సహకరిస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుకు ఈసారి జగన్ సీటు ఇవ్వలేదు. ఆయన నియోజకవర్గంలో వైసీపీని చాలా వరకు నాశనం చేశారన్న విమర్శలు ఉన్నాయి. దానిని నాగార్జున ఎంతవరకు సెట్ రైట్ చేసుకుంటారు అన్నది సందేహంగానే కనిపిస్తోంది.

ఇక ఎర్రగొండపాలెం లో మాత్రం వైసీపీ, టీడీపీ రెండు పార్టీల నుంచి కొత్తవారు అసెంబ్లీ బరిలో ఉన్నారు. టీడీసీ నుంచి ఆ పార్టీలో తక్కువ టైంలో అసెంబ్లీ స్థాయికి ఎదిగిన గూడూరి ఎరిక్సన్ బాబు పోటీ చేస్తున్నారు. వైసీపీ కంచుకోట అయిన ఎర్రగొండపాలెంలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎరిక్సన్ బాబు తీసుకువెళ్లారు అన్నది వాస్తవం. ఇక బాలినేని రికమండేషన్ తో సీటు దక్కించుకున్న తాటిపర్తి చంద్రశేఖర్ బాగా కష్టపడుతున్నారు. ఇక్కడ ఎవరు గెలిచినా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనట్టు అవుతుంది. మరి ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: