ఎడిటోరియల్: కండువా కప్పేటప్పుడు జాగ్రత్త పడకపోతే దెబ్బ ఖాయం

Vijaya

జాగ్రత్త పడకపోతే జగన్మోహన్ రెడ్డిపై దెబ్బ పడటం ఖాయం. ఈ విషయంలో వైసిపి శ్రేణులు చాలా ఆందోళన పడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో టిడిపిలో నుండి వైసిపిలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికి ముగ్గురు ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంపిలు టిడిపికి రాజీనామా చేశారు. రాజీనామాలు చేసిన వారిలో రావెల కిషోర్ బాబు మాత్రం జనేసేనలో చేరారు. మిగిలిన ఎంఎల్ఏలు మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కిషోర్ బాబుతో పాటు ఎంపిలు అవంతి శ్రీనివాస్, తాజాగా పందుల రవీంద్ర టిడిపి నుండి బయటకు వచ్చేశారు.

 

సరే, పార్టీ నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఎంఎల్ఏలైనా ఎంపిలైన చంద్రబాబునాయుడుపై విమర్శలు, ఆరోపణలు చేయటం సహజం.  వైసిపిలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత  ఫిరాయింపు ఎంఎల్ఏలు, ఎంపిలు జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం అందరూ చూసిందే. కాబట్టి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రజా ప్రతినిధులు చేసే ఆరోపణలకు, విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు.

 

జగన్ ను దెబ్బ కొట్టేందుకే చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఏ కారణంతో ఫిరాయింపులను ప్రోత్సహించినా ఇపుడు వాళ్ళని వదిలించుకునేందుకు నానా అవస్తలు పడుతున్నారు. ఎందుకంటే, వారందరి మీద జనాల్లో బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. వాళ్ళకు మళ్ళీ టికెట్లు ఇవ్వలేరు, ఇచ్చి గెలిపించుకోలేరు. ఒకవేళ వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే ఫిరాయింపులేం చేస్తారో తెలీక చంద్రబాబు అవస్తలు పడుతున్నారు.

 

ఇక జగన్ విషయానికి వస్తే టిడిపిలో నుండి వచ్చేసిన వాళ్ళందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇక్కడే పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీలో చేరుతున్న వాళ్ళందరూ టికెట్ పై జగన్ నుండి హామీ పొందిన తర్వాతే చేరుతున్న విషయం తెలిసిందే. వచ్చిన వాళ్ళంతా టిడిపిలో నుండి ఎందుకు వచ్చేసినట్లు ? అదికూడా సరిగ్గా ఎన్నికలకు ముందు ఎందుకు వచ్చేస్తున్నారు ?

 

ఈ అంశాలనే జగన్ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. టిడిపి నుండి బయటకు వచ్చేసిన వాళ్ళేమీ బ్రహ్మాండమైన జనబలం ఉన్న వాళ్ళు కాదు. నాలుగున్నరేళ్ళపాటు టిడిపిలో అన్నీ అధికారాలను అనుభవించిన వాళ్ళే. అందరిపైనా విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. మరి ఇపుడే ఎందుకు వచ్చేస్తున్నారంటే చంద్రబాబు టికెట్ ఇవ్వరన్న అనుమానాలుండాలి. లేకపోతే టికెట్ దక్కినా గెలుపుపై నమ్మకం లేని వాళ్ళే వచ్చేస్తుండాలి.

 

జనాల వ్యతిరేకత ఉన్న వాళ్ళు వైసిపి తరపున మాత్రం ఎలా గెలుస్తారు ?  చీరాలలో ఆమంచిపై కనిపిస్తున్న వ్యతిరేకతే అందుకు నిదర్శనం. కాబట్టి వచ్చిన వాళ్ళని పార్టీలోకి చేర్చుకోవటంలో ఎవరికీ అభ్యంతరాలుండక పోవచ్చు. కానీ టికెట్లిచ్చే విషయంలోనే జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం జరగటం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: