ఎడిటోరియల్ : జగన్ శాడిస్టా ? ఉక్రోషం తట్టుకోలేక పోతున్నారు

Vijaya

జగన్మోహన్ రెడ్డి పై ఉన్న ఉక్రోషాన్ని చంద్రబాబునాయుడు తట్టుకోలేకపోతున్నారు. సమయం లేదు, సంద్భం లేదు అవకాశాన్ని కల్పించుకుని మరీ జగన్ ను తిట్టటమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు. తాజాగా పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ జగన్ ను శాడిస్టుతో పోల్చారు. రానురాను జగన్ లో సైకో లక్షణాలు పెరిగిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సైకో అన్నా శాడిస్టన్నా ఇబ్బందేమీ లేదు కానీ అందుకు ఆధారాలను మాత్రం చెప్పలేకపోయారు.

 

చంద్రబాబు ధోరణి ఎలాంగుందంటే గుడ్డకాల్చి మీదేసేద్దామన్నట్లే కనబడుతోంది. లేకపోతే అభివృద్ధిని, పెట్టుబడులను జగన్ అడ్డుకుంటున్నారని చెప్పటం చోద్యం కాక మరేంటి ? పెట్టుబడిదారులను, పారిశ్రామిక వేత్తలను కలిసి ఏపిలో పెట్టుబడులు పెట్టొద్దన్నారా ? పోని వచ్చిన పారిశ్రామికవేత్తలెవరైనా ఆ విధంగా జగన్ పై చెప్పారా ? రెండింటిలో ఏదీ జరక్కుండానే మరి జగన్ పరిశ్రమలను, పెట్టుబడులను అడ్డుకుంటున్నట్లు చంద్రబాబు ఎలా ఆరోపిస్తున్నారు ?

 

ఒకవైపు జగన్ పై గుడ్డకాల్చి మీదేస్తునే మరోవైపు తనను చూసే పారిశ్రామికవేత్తలంతా ఏపికి క్యూ కడుతున్నట్లు చెప్పటం తప్పా ? విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో రూ 15 లక్షల కోట్లకు అవగాహనా ఒప్పందాలు కుదిరినట్లు చెప్పింది చంద్రబాబే కదా ? పరిశ్రమలు రాష్ట్రానికి రావటం వల్ల లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పుకుంటున్నది కూడా చంద్రబాబే. అంటే ఏకకాలంలో ఒకవైపు తన గురించి తానే భుజాలు చరుచుకుంటూనే మరోవైపు జగన్ ను శాడిస్టని, సైకో అంటూ ముద్రేసే ప్రయత్నం చేస్తున్న విషయం స్పష్టమవుతోంది.

 

అబివృద్ధిని అడ్డుకోవటమే సైకో లక్షణాలుగా చంద్రబాబు వర్ణించారు. పసుపు కుంకుమ కార్యక్రమాన్ని అడ్డుకోవటమే జగన్ శాడిజానికి నిదర్శనంగా చెప్పటం మరీ విచిత్రంగా ఉంది. జగన్ ది శాడిజమనే అనుకుందాం కాసేపు. మరి పోయిన ఎన్నికల్లో డ్వాక్రా మహిళ రుణాలను మాఫీ చేస్తానని చెయ్యకపోవటాన్ని ఏమంటారు ? ఆ హామీ అలా ఉండగానే తాజాగా పసుపు కుంకుమ పేరుతో ఏకకాలంలో 94 లక్షల డ్వాక్రా మహిళలను మోసం చేయటానికి ప్రయత్నించటాన్ని ఏమంటారు ? అసలు ఏ ప్రభుత్వ అయినా ఎవరికైనా పోస్ట్ డేడెట్ చెక్కులిస్తుందా ? పోస్టు డేటెడ్ చెక్కులిస్తున్న చంద్రబాబును డ్వాక్రా మహిళలు మోసగాడంటున్న మాట వాస్తవం కాదా ?

 

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ గ్రాఫ్ పెరుగుతోందని, చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోందని జాతీయ మీడియా సర్వేల్లో కనబడుతోంది. నాలుగున్నరేళ్ళ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్నది వాస్తవం. రేపటి ఎన్నికల్లో గెలుపుపై చంద్రబాబులోనే నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. ఈ క్రమంలో జగన్ పై జరిగిన దాడి కేసు, ఓటుకునోటు కేసులు చుట్టుకుంటున్నాయి. అందుకనే జగన్ పై చంద్రబాబులో ఉక్రోషం పెరిగిపోతోంది. లేకపోతే పార్టీ నేతలతో మాట్లాడేందుకు టెలికాన్ఫరెన్సు పెట్టుకుని జగన్ ను తిట్టాల్సిన అవసరం ఏంటి ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: