ఎడిటోరియల్ : టిడిపిలో కోట్ల చేరికతో బిసిలకు నష్టమేనా ?

Vijaya

కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టిడిపిలో చేరటం వల్లే జిల్లా అంతా టిడిపికి ఏకపక్షంగానే ఉంటుందని ఒకటే ఊదరగొడుతున్నారు. కోట్ల చేరికపై చంద్రబాబునాయుడుకి మద్దతుగా నిలబడే మీడియా కూడా ఇంకేముంది కర్నూలు  జిల్లాలో వైసిపి పని అయిపోయినట్లే అంటూ ఒకటే మోసేస్తోంది. కానీ క్షేత్రస్ధాయిలోని పరిస్దితులను చూస్తే మాత్రం టిడిపికి పెద్ద లాభించదనే అనిపిస్తోంది. కోట్ల గనుక టిడిపిలో చేరితే ముందుగా దెబ్బ పడేది బిసి సామాజికవర్గం మీదే అనటంలో సందేహమే లేదు.

 

కోట్ల చేరిక వల్ల బిసిలకు టిడిపి ఏ విధంగా నష్టం చేస్తోందో చూద్దాం. రాయలసీమలో ఎనిమిది లోక్ సభ సీట్లున్నాయి. అందులో చిత్తూరు, తిరుపతి స్ధానాలు ఎటూ ఎస్సీ రిజర్వుడే. మిగిలిన ఆరు సీట్లలో మూడు సీట్లను వైసిపి బిసిలకు కేటాయిస్తోంది. కర్నూలు, అనంతపురం, హిందుపురం స్ధానాలను బిసిలకు కేటాయించనున్నట్లు పాదయాత్ర సందర్భగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మిగిలిన కడప, రాజంపేట, నంద్యాల సీట్లలో రెడ్లు పోటీ చేస్తారు.

 

మరి తెలుగుదేశంపార్టీ పరిస్ధితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండబోతోంది. కోట్లను పార్టీలోకి చేర్చుకోవటం వల్ల కర్నూలు సీటును ఆయనకే కేటాయించాలి. నంద్యాల సీటును కూడా సిట్టింగ్ ఎంపి కాబట్టి రెడ్డికో లేకపోతే మరో రెడ్డికో కేటాయిస్తారు. అంటే కర్నూలు జిల్లాలోని రెండు సీట్లు రెడ్లకే వెళిపోతాయి. కడప సీటులో ఎవరో ఒక రెడ్డి పోటీ చేయటం ఖాయం. అలాగే రాజంపేట సీటులో సాయిప్రతాప్ లేకపోతే మరో బలిజ నేతే పోటీ చేస్తారు. ఇక, అనంతపురం లోక్ సభ సీటులో జేసి దివాకర్ రెడ్డి కానీ లేకపోతే జేసి పవన్ రెడ్డి కానీ పోటీ చేస్తారు. మిగిలిన హిందుపురం సీటు మాత్రమే బిసిలకు ఇచ్చే అవకాశం ఉంది.

 

అయితే, హిందుపురం ఎంపి సీటు మీద నందమూరి బాలకృష్ణ కన్ను పడిందంటున్నారు. బాలకృష్ణకు కాకపోతే తాను పోటీ చేస్తానని పరిటాల శ్రీరామ్ ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకున్నారట. బాలకృష్ణ పట్టుబడితే హిందుపురం సీటును ఆయనకే కేటాయించక తప్పదు. అదే జరిగితే ఆ సీటు కూడా బిసిల నుండి చేజారిపోతుంది. అంటే టిడిపి నుండి రాయలసీమ నుండి పోటీ చేయటానికి బిసిలకు అవకాశమే ఉండదు. హోలు మొత్తం మీద చూస్తే బిసిలకు వైసిపి మూడు సీట్లు కేటాయిస్తుంటే టిడిపి నుండి ఒక్క స్ధానం కూడా అనుమానమే.

 

రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో అనంతపురం, హిందుపురం, కర్నూలు లోక్ సభ స్ధనాల పరిధిలోనే బిసి సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే పై మూడు స్ధానాలను బిసిలకే కేటాయించనున్నట్లు జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రకటించారు. ప్రకటించినట్లు మూడు సీట్లు కేటాయిస్తే బ్రహ్మాండమే. ఒకవేళ మూడు కేటాయించలేకపోయినా కనీసం రెండు సీట్లను కేటాయించినా గొప్పే. టిడిపికి ఆ అవకాశం కూడా లేదు. మరి జయహో బిసి అంటూ రాజమండ్రి బహిరంగ సభలో చేసిన ఆర్భాటానికి ఏమిటర్ధం ? బిసిలకు ఏ పార్టీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: