లంగా ఓణీ వేయాల్సిందే.. అబ్బాయిల గుండెల్లో మంట పెట్టాల్సిందే..
విరిసీవిరయని పూబంతుల అందానికి మరింత అందాన్నిచ్చేది లంగా ఓణీ మాత్రమే. చిన్నదాని సొగసుకూ పడుచుప్రాయపు హొయలకూ ఇంతకు మించిన సాంప్రదాయ వస్త్రాలంకరణ ఉంటుందా. ఈ వండర్ ఫుల్ డ్రస్సులో యావరేజ్ అమ్మాయి కూడా దివి నుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపిస్తుంది.
రోజురోజుకూ దూసుకొస్తున్న సరికొత్త ఫ్యాషన్లతో.. ఈ పురాతన లంగాఓణీ కాస్త వెనుకబడ్డట్టు కనిపించినా దీని అందం ఏ ఫ్యాషన్ కూ సాటి రాదు కదూ. పొలంలో విరిసిన ముద్దబంతిలా.. పెరటి తోటలోని మందారంలా.. అరవిరిసిన మల్లెమొగ్గలా.. అతివల అందాన్ని రెట్టింపు చేసేది ఈ లంగా ఓణీయే. అయితే సంక్రాంతి వేళ ఈ డ్రస్సులో మెరవాలంటే కాస్త ముందే మేలుకోవాలి.
ఎందుకంటే ఇప్పుడు లంగా ఓణీలోనూ ఎన్నో వెరైటీలు వచ్చాయి. పట్టులంగా అంటే గతంలో ఒకటే రంగులో ఉండేది.. కానీ ఇప్పుడు ఫ్యాషన్ మారింది. జరీబుటీలనీ.. చారలనీ గడులనీ అద్దుకుని వింతైన రంగుల్లో చూడచక్కని ఓణీలు కనువిందు చేస్తున్నాయి. ఏనుగులూ నెమళ్లూ చిలకల డిజైన్లతో వచ్చే పోచంపల్లి పట్టు డిజైన్లూ ఈ లంగాఓణీల ఆందాలను రెట్టింపు చేస్తున్నాయి.
ఎంబ్రాయిడరీ, తళుకుబెళుకులతో ఈ డ్రస్ అదిరిపోవాలంటే ముందే ఆర్డర్ ఇచ్చుకోవాలి. టైలర్లకు తగినంత టైమ్ ఇవ్వాలి. అప్పుడే అదిరిపోయే లంగాఓణీలో సంక్రాంతి వేళ అమ్మాయిలు అదరగొడతారు. పండుగంతా తమదే అనిపించుకోవాలంటే.. ఆ మాత్రం ప్లానింగ్ ఉండాలి కదా.