ఎన్టీఆర్ ను తెగ మెచ్చుకున్న కేటీఆర్..? ఏ విషయంలోనో తెలుసా..?
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఇటీవల ఎన్నికైన కల్వకుంట్ల తారక రామారావు ఇక పార్టీపై మరింత పట్టుబిగించబోతున్నాడు. ఇప్పటికే పార్టీలో ఆయనే అనధికారికంగా నెంబర్ టూ. ఇప్పుడు పదవి కూడా లభించడంతో మరింతగా దూకుడు పెంచనున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగు దేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
టీఆర్‌ఎస్ ఇకపై జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందన్న కేటీఆర్.. హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయకూడదని ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆయన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ పార్లమెంటులోనే ప్రతిపక్ష పాత్ర పోషించిన సంగతి గుర్తు చేశారు.
ఆ తర్వాత కాలంలోనూ ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ పెట్టి జాతీయ స్థాయిలో ప్రధాన పాత్ర పోషించిన విషయాన్నీ కేటీఆర్ ప్రస్తావించారు. ఇకపై దేశంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లలో దేనికీ పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ అంచనా వేశారు.
బీజేపీకి వచ్చే ఎన్నికల్లో 160 వరకూ స్థానాలు వస్తాయని.. కాంగ్రెస్ సంఖ్య 90 దాటకపోవచ్చని కేటీఆర్ జోస్యం చెప్పారు. మిగిలిన సీట్లన్నీ ప్రాంతీయ పార్టీలకే దక్కుతాయని.. అందుకే ఈసారి కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే ఆధిపత్యం ప్రదర్శిస్తాయన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కేటీఆర్ అంచనా వేస్తున్నారు.