ఆంధ్రప్రదేశ్ లో బాజపా ఆత్మహత్య? అంతా స్వయకృతాపరాధం!

తిరుమలేశుని సమక్షంలో నేటి భారత ప్రధాని నరెంద్ర మోడీ నాటి  ఎన్నికల ప్రచారంలో పలికిన పలుకులు వాగ్ధానాలు  

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా,
విశాఖపట్నానికి రైల్వే జోన్,
ఢిల్లీని మరింపిచేలా రాజధాని 
పోలవరం ప్రోజెక్ట్ నిర్మాణం 


గత ఎన్నికల ముందు బీజేపీ-టీడీపీ కూటమి ఇచ్చిన ప్రధాన హామీలు. 



బాజపా అధికారంలోకి రావడంతో మన సమస్యలు తీరతాయని సామాన్యుడు ఆశించాడు. కాలం గడచిపోతోంది నాలుగేళ్లయినా ఆ ప్రత్యేకహోదా గురించి ఎలాంటి ఊసు లేదు. పోలవరం లాంటి ప్రతిష్ఠాత్మక ప్రోజెక్ట్ కు కూడా అరకొర నిధులు కేటాయిస్తూ చిట్ట చివరి సంపూర్ణ బడ్జెట్ దశకు చేరింది. ఏరకంగా చూసినా రాష్ట్రానికి మొండిచేయి చూపారు. దీంతో బీజేపీ టీడీపీల మధ్య స్నేహబంధం క్రమంగా కరిగిపోతూ వస్తుంది.

చివరి బడ్జెట్ లో కూడా ఎలాంటి కేటాయింపులు లేకపోవటంతో టిడిపి ఎంపీలతో మాట్లాడిన చంద్రబాబు "వేచి చూద్దామని పార్లమెంట్‌లో పోరాడాలని" సూచించారు. దీంతో టీడీపీ ఎంపీలు తమ అధినేత సూచనలకు అనుగుణంగా పార్లమెంట్‌లో నిరసన గళం వినిపిస్తున్నారు. తాజాగా బడ్జెట్‌పై చర్చకు బదులిస్తూ, ఏపీ అంశాన్ని ప్రస్తావించిన అరుణ్ జైట్లీ ఎప్పుడో మంగళం పాడిన ప్రత్యేక హోదా ఊసెత్తలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం బంద్ చేపట్టినప్పటికీ.. జైట్లీ మాత్రం పాత పాటే పాడారు.


కేంద్రం వైఖరికి నిరసనగా, ఎంపీ సీఎం రమేష్ బాజపా లక్ష్యంగా ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు పట్టిన గతి పట్టకుండా చూసుకోవాలని కూడా హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.


మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వని, ఏమీ చేయని మీతో పొత్తెందుకు పెట్టుకోవాలని ఎంపీలంతా బాజపాని బాహాటంగానే విమర్శించారు. టీడీపీ నేతల వైఖరి చూస్తుంటే బీజేపీతో తెగదెంపులకే సిద్ధమై ఉన్నారనిపిస్తోంది.


తెలుగు దేశం పార్టీ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్న పవన్ కల్యాణ్ స్వరంలో ఇటీవల మార్పు వచ్చింది. పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారంటూ బీజేపీపై విమర్శలు మొదలు పెట్టిన ఆయన బాజపా పార్టీపై ఆగ్రహంగానే ఉన్నారు. ఎన్డీయేలో లేనని గతంలోనే ప్రకటించారు. అయితే రూటు మార్చి ఇప్పడు లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణతో జేఏసీ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నారు. దీంతో రానున్న భవిష్యత్ లో వీరిద్దరూ రాజకీయంగా కలిసి ముందుకెళ్తే అది "టీడీపీకి ఇబ్బందులు కల్పించే అవకాశం" ఉంది. ముఖ్యంగా ఈ విషయం టీడీపీకి అత్యంత ప్రమాధకరమైన సమస్య ఇదే టిడిపి ఆలోచనల్లో మార్పు కు ప్రధాన కారణంగా చెపుతున్నారు విశ్లేషకులు. 



అయితే నిన్నటి దాకా బీజేపీతో పొత్తు కోసం సిద్ధమని సంకేతాలు పంపిన ప్రతిపక్ష వైసిపి కూడా ఇప్పుడు ఆ మాట మాట్లాడలేని పరిస్థితి. కమలంతో కలిసి బరిలో దిగితే జనాలు అసహ్యించుకునే ప్రమాధాన్ని వైసిపి నేతలు గుర్తించినట్లే తెలుస్తుంది. ఇప్పటి దాకా వైసిపికి కనూగీటుతూ తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెట్టిన బాజపా నాయకత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయి చూపి "సెల్ఫ్ గోల్" చేసుకుంది. 


ఇప్పటికైనా తేరుకుని తప్పు దిద్దుకోకపోతే, తమిళనాడు ఆర్కేనగర్ ఉపఎన్నిక ఫలితాల తరహా లోనే ఆంధ్ర ప్రదేశ్ లోనూ బీజేపీ కి చావుదెబ్బ పడే అవకాశం ఉంది. తనకున్న అతి కొద్ది పాటి ఓటు బ్యాంకు తో రాష్ట్రంలోని రెండు పార్టీలతో ఇన్నాళ్లు ట్రైయాంగులర్ లవ్  స్టోరీ నడిపిన బీజేపీ ఇప్పుడు ఇరుపక్షాలనుండి  సాండ్విచ్ లో పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతా బాజపాకి ఆత్మహత్యా సద్రుశమే. అందుకే రాజకీయాల్లో హత్యలుండవు అన్నీ ఆత్మహత్యలే అని అంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: