టీ కాంగ్రెస్‌కి కొత్త జ్వ‌రం.. రీజ‌న్ ఇదే..

VUYYURU SUBHASH
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఊపు క‌నిపించాల్సింది పోయి.. కొత్త జ్వ‌రం క‌నిపిస్తోంది. నేత‌లు ఒక‌రికొక‌రు మాట్లాడుకోవ‌డం కూడా మానేశారు. అయితే, ఎవ‌రికి వారే త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితిపై మ‌ల్ల‌గుల్లాలు మాత్రం ప‌డుతున్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో పీసీసీ చీఫ్‌.. అధికార టీఆర్ ఎస్‌ను ఎలా ఎదిరించాల‌నే వ్యూహానికి మ‌రింత ప‌దును పెంచుతున్నారు. దీనంత‌టికీ రీజ‌న్ ఒక్క‌టే.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కోయిల ముందుగానే కూస్తుంద‌ని వార్త‌లు వ‌స్తుండ‌డ‌మే. నిజానికి వాస్త‌వ అంచ‌నాలు లెక్క‌ల ప్ర‌కారం 2019 మేలో ఎన్నిక‌లు జ‌ర‌గాలి. అయితే, ఇటు రాష్ట్రంలోని అధికార పార్టీ టీఆర్ ఎస్‌, కేంద్రంలోని అధికార బీజేపీలు కూడా ముంద‌స్తుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. 


దీంతో ఈ ఏడాది న‌వంబ‌ర్‌కే అసెంబ్లీ ర‌ద్ద‌యినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన  అవ‌స‌రం క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం, గెలిచి తీరాల్సిన ప‌రిస్థితి ఉండ‌డం, అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఉండ‌డం వంటి రీజ‌న్ల నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత‌ల్లో కొత్త జ్వ‌రం ప‌ట్టుకుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. గులాబీ పార్టీకి వ్యతిరేక శ‌క్తుల‌ను ఏకం చేస్తూ.. మ‌రోవైపు బ‌స్సు యాత్రతో తెలంగాణ‌ను చుట్టేసేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్‌. ఈ క్ర‌మంలోనే మొద‌ట నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఇంచార్జ్‌ ల‌ను నియ‌మించే ప‌ని చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇప్పటికే టీఆర్ ఎస్‌ తో ఢీ అంటే ఢీ అంటున్న నేత‌ల‌పై స్పష్టత‌తో ఉన్న పీసీసీ.. వారికి పూర్తి బాధ్యత‌లను అప్పగించాలని నిర్ణయించింది. 


రాష్ట్రంలోని 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికిప్పుడు 65 స్థానాలకు ఇంఛార్జ్‌ల‌ను ప్రక‌టించాల‌ని నిర్ణ‌యించింది. అంతే కాకుండా.. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంఛార్జ్‌ల‌ను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌ల‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్లు ఖాయమ‌ని చెప్పడం ద్వారా.. వారంతా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేందుకు క‌ష్టప‌డి ప‌నిచేస్తార‌ని.. పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేస్తార‌ని పీసీసీ బ‌లంగా న‌మ్ముతుంది. ఎన్నిక‌లు రాక‌ముందే ఎంపీ అభ్యర్ధి, ఎమ్మెల్యే అభ్యర్ధులు స‌మ‌న్వయంతో ప‌నిచేస్తే కాంగ్రెస్‌ గెలుపు ఖాయ‌మని పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ లెక్క‌లు క‌ట్టి.. అధిష్టానానికి సైతం చేర‌వేసిన‌ట్టు తెలుస్తోంది. 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో 70 సీట్లను గెల‌వ‌డం  ద్వారా అధికారంలోకి వ‌చ్చేలా పావులు క‌దుపుతున్నారు ఉత్త‌మ్‌. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్ల‌డం, అధికార పార్టీపై తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక ప్ర‌చారాన్ని చేయ‌డం వంటి వాటికి కూడా పీసీసీ చీఫ్ రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే, ఇంత చేస్తున్నా.. గులాబీ బాస్ కేసీఆర్ వేసే వ్యూహం ముందు తాము నిల‌బ‌డ‌తామా?  లేక చిత్త‌వుతామా? అని నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: