తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ కు రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది కనిపించడం లేదు.. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ టీఆర్ఎస్ దే అధికారం అన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అన్ని వర్గాలను కలుపుకుపోతున్న కేసీఆర్ చాణక్యంతో పాటు.. రాజకీయంగా ప్రతిపక్షాలు అత్యంత బలహీనంగా ఉండటం ఇందుకు కారణం.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అంతగా ప్రతిభ చూపడం లేదు.
ఆ పార్టీలో ఉన్నన్ని గ్రూపు రాజకీయాలు ఇంకెక్కడా లేవు. ఇటీవల టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి వెళ్లినా అంత ప్రభావం కనిపించడం లేదు. మరోవైపు తెలంగాణ టీడీపీ దాదాపు కనుమరుగయ్యిందనే చెప్పాలి. ఇక బీజీపీ పరిస్థితి కూడా అంతే.. ఈ నేపథ్యంలో బలమైన ప్రతిపక్షం అనే పోస్టు తెలంగాణలో ఖాళీగా ఉన్నట్టే లెక్క. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ను అంతో ఇంతో ఇబ్బంది పెడుతున్నది తెలంగాణ రాజకీయ జేఏసీ మాత్రమే.
కొలువుల కోసం కోట్లాట.. సర్కారు అడ్డగోలు భూసేకరణ, అమరుల అనాదరణ, రైతు ఆత్మహత్యలు.. ఇలా అన్ని విషయాలపైనా అంతో ఇంతో పోరాడుతున్నది కోదండరామే. అలాంటి కోదండరామ్ ఇప్పుడు పార్టీ పెట్టేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. ఆ పార్టీ పేరుపై కూడా కసరత్తు తుదిదశకు చేరినట్టు తెలుస్తోంది. తెలంగాణ జన సమితి పేరుతో ఈ పార్టీని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారట.
ఇప్పటికే తెలంగాణ జేఏసీ పేరు బాగా పాపులర్ అయ్యింది కాబట్టి.. పార్టీ పేరు కూడా అదే తరహాలో ఉండాలని భావిస్తున్నారట. ఈ నెలాఖరుకు కోదండరామ్ అమరవీరుల స్పూర్తి యాత్ర పూర్తి అవుతుంది. ఇక ఆ తర్వాత పార్టీ ఏర్పాట్లపై దృష్టి పెట్టవచ్చన్నది ఒక విశ్లేషణ. గతంలో తెలంగాణ ఉద్యమానికి రెండు చక్రాలుగా ముందుండి నడిపిన కేసీఆర్, కోదండరామ్ మధ్య.. ఇప్పుడు విభేదాలు తారాస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.