ఆ జిల్లాలో ఏం జరుగుతోంది..? రైతులు హఠాత్తుగా ఎందుకు చనిపోతున్నారు..?

Vasishta

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఘోరం జరిగింది. పత్తి చేలకు పురుగుల మందు స్ప్రే చేస్తూ ఇప్పటి వరకు 20 మంది మృతిచెందారు. పలువురు కంటి చూపు కోల్పోయారు. సుమారు 600 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు సీఎం ఫడ్నవీస్ కమిటీని వేశారు.


పత్తి చేలకు పురుగుల మందు స్ర్పే చేస్తూ యావత్మాల్ ప్రాంతంలో ఇప్పటి వరకు 20 మంది రైతులు చనిపోయారు. దీంతో యావత్మాల్ జిల్లాలో అధికారులు హైలర్ట్ ప్రకటించారు. పత్తి చేలకు పురుగుల మందు పిచికారీ చేస్తూ ఆ వాసనలు పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం 600 మంది రైతులు పురుగుల మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురయ్యారు. వీరిలో వంద మందికి పైగా వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని  ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారు.


విదర్భ ప్రాంతానికి చెందిన ఇందర్ రాథోడ్ గత వారం పత్తి చేనుకు పురుగుల మందు స్ప్రే చేయడానికి పనికి వెళ్లాడు. అదే అతడు పనికి వెళ్లడం చివరిసారైంది. అనంతరం ఆ కూలీ తన కంటిచూపును కోల్పోయాడు. కంటి చూపు పోవడంతో అతని జీవితమే కాదు కుటుంబం కూడా అంధకారంలో పడింది. దీంతో నిరాశకు లోనైన రాథోడ్ నాలుగు రోజులక్రితం రెండస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కాయి గానీ కాలు మాత్రం విరిగింది.


బ్రహ్మానంద్ ఆదిక్ అనే మరో వ్యక్తి సైతం పత్తిచేనుకు పురుగులమందు పిచికారి చేసిన అనంతరం తలతిరిగి పడిపోయాడు. లేచిచూసే సరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గుర్తించాడు. ఇతను సైతం కంటి చూపును కోల్పోయాడు. ఇలా ఒక్కరు కాదు 20 మంది వరకు ప్రాణాలు కోల్పొయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరిలో ఆందోళన మొదలైంది. అసలేం జరిగుతోందో తెలియడం లేదు.


వెంటనే సమస్యను గుర్తించి చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం చేరవేయడంలో విఫలమయ్యారని ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం ఫడ్నవీస్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మృతులకు 2 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ప్రకటించారు. పురుగుమందుల పిచికారిపై అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు మాస్కులు, గ్లౌజ్‌లు అందజేయడం వంటి చర్యలు చేపట్టాలని సీఎం ఫడ్నవీస్ అధికారులను ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: