జగన్ కు బిగ్ షాక్.. ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్..!?

Chakravarthi Kalyan
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగలబోతోందా.. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారా.. ఇప్పుడీ పుకార్లు ఏపీ పొలిటికల్ సర్కిల్లో షికారు చేస్తున్నాయి. అది కూడా వైసీపీకి మంచి పట్టు ఉన్న కర్నూలు జిల్లా నుంచి ఈ వలసలు ఉండనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని పత్రికల్లోనూ ఈ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో పదకొండు జగన్ పార్టీ మనుషులు గెలుచుకున్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు, డోన్, ఆదోని, కొడుమూరు, మంత్రాలయం, నందికొట్కూరు, పాణ్యం, శ్రీశైలం, ఆలూరు నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు టీడీపీకి జంప్ కొట్టాలని డిసైడయ్యారన్నది పుకార్ల సారాంశం. 

మరి ఆ ఐదుగురు ఎవరన్నది మాత్రం ఇంకా తేలడం లేదు. ఇంకో విశ్లేషణ ఏమిటంటే.. మొన్నటికి మొన్న కడప జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. ఆది నారాయణ రెడ్డిని టీడీపీలోకి చేర్చుకోవడం ద్వారా జగన్ కు సొంత జిల్లాలోనే జలక్ ఇవ్వాలని టీడీపీ నేతలు భావించారు. ఆమేరకు ఆది నారాయణ రెడ్డితో చర్చలు కూడా జరిగాయి. 

కానీ అనూహ్యంగా ఆది నారాయణ రెడ్డి చేరికకు టీడీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. టీడీపీ నేత రామసుబ్బారెడ్డి అయితే ఈ విషయంలో చంద్రబాబుపైనే గుర్రుగా ఉన్నారు. చివరకు పరిస్థితి ఎలా అయ్యిందంటే.. ఆది నారాయణరెడ్డి టీడీపీలోకి వస్తే.. రామ సుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లాలని డిసైడయ్యారు. ఆమేరకు చర్చలు కుడా జరిగాయట.

దాంతో పరువుపోతుందన్న భయంతో పసుపు దళం వెనుకడగు వేసింది. అబ్బే ఆదినారాయణ రెడ్డిని  మేమేమీ పార్టీలోకి రమ్మనలేదని టీడీపీ కడప జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గారు గంటా శ్రీనివాసరావు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ డ్యామేజీ నుంచి జనం దృష్టి మరల్చేందుకే ఈ ఐదుగురు ఎమ్మెల్యే జంపింగ్ వార్తను సృష్టించారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. మీడియా అండతో టీడీపీ చేస్తున్న రాజకీయ కుట్రలు ఫలించవని వారు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: