బెంగుళూరు : బీజేపీపై కసి తీర్చుకున్న గాలి

Vijaya




ఓబుళాపురం మైనింగ్ కింగ్ గాలి జనార్ధనరెడ్డి బాగా కసితీర్చుకున్నట్లే ఉన్నారు. తాజాగా వెల్లడైన కర్నాటక అసెంబ్లీ ఫలితాలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఒకపుడు బీజేపీలో ఓ వెలుగు వెలిగిన గాలి ముందు ప్రభుత్వానికి తర్వాత పార్టీకి కూడా దూరమయ్యారు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నపుడు బీజేపీలోని అగ్రనేతల్లో చాలామంది గాలి ‘ఆతిధ్యం’ స్వీకరించిన వారే. తర్వాత ఆయనపై కేసులు నమోదుకాగానే మంత్రిగా తప్పించారు. తర్వాత పార్టీ నుండి కూడా బహిష్కరించారు.



ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గాలి బీజేపీపై బాగా కసిపెంచుకున్నారు. ఆ కసిని తాజా ఎన్నికల్లో కసితీరా తీర్చుకున్నారు. ఎలాగంటే కల్యాణ్ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ) అనే పార్టీ ద్వారా తాను పోటీచేయటమే కాకుండా సుమారు 70 మంది అభ్యర్ధులను దింపారు. బళ్ళారి, రాయదుర్గ, రాయచూర్ జిల్లాల్లో అభ్యర్ధులు బీజేపీకి చాలా గట్టిపోటీ ఇచ్చారు. ఉత్తరకర్నాటకలో మామూలుగా బీజేపీ స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాంటిది గాలి పార్టీ దెబ్బకు కమలం కుదేలైపోయింది.



సుమారు 50 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధుల ఓటమిపై గాలి అభ్యర్ధుల ప్రభావం స్పష్టంగా కనబడింది. 30 నియోజకవర్గాల్లో బీజేపీకన్నా గాలి పార్టీ అభ్యర్ధులే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులకు పోటీపోటీగా నిలిచారు. బీజేపీ-కేఆర్పీపీ అభ్యర్ధుల పోటీవల్ల ఏమైందంటే చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు.



గాలి పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్ధులు ఓట్లను చీల్చేయటంతో బీజేపీ మీద గట్టి దెబ్బపడి చివరకు ఓడిపోయింది. ఇక్కడ విషయం ఏమిటంటే తాను గెలవకపోయినా పర్వాలేదు బీజేపీ అభ్యర్ధులను మాత్రం గెలవనివ్వకూడదన్నదే గాలి కాన్సెప్టు. తన కాన్సెప్టులో గాలి నూరుశాతం సక్సెస్ సాధించారు. ఒకపుడు తనను దెబ్బకొట్టిన బీజేపీని ఇపుడు అవకాశం దొరకగానే గాలి కూడా అంతేస్ధాయిలో తిరిగి దెబ్బకొట్టారన్నమాట. ఎన్నికలకు ముందే బీజేపీని తాను ఫుట్ బాల్ ఆడుకుంటానని చప్పిన గాలి అన్నంతపనీ చేసి చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: