అమరావతి : మెల్లిగా పవన్ ముసుగు తొలగిపోతోందా ?

Vijaya



అదేదో సినిమాలో ‘గంగ మెల్లిగా చంద్రముఖిలాగ మారుతుంద’నే డైలాగులాగే పవన్ కల్యాణ్ వేసుకున్న ముసుగు కూడా మెల్లిగా తొలగిపోతోంది. జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం దగ్గరకు వచ్చేకొద్దీ పవన్ అసలు రంగు బయటపడుతున్నట్లుంది. పార్టీ ట్విట్టర్లో పవన్ చేసిన తాజా ట్వీట్లే దీనికి ఉదాహరణ. తాను కొందరివాడిని కానని అందరివాడినని మొన్నటివరకు చెప్పుకున్నారు. కానీ తాజా ట్వీట్లు చూసిన తర్వాత పవన్ తాను కేవలం కొందరి వాడిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమైపోతోంది.



తాను కాపునని, కాపులంతా తనకు అండగా నిలబడాలని, కాపులు తనను నాయకుడిగా గుర్తించాలని బతిమలాడుకుంటున్నారు. జనసేన గెలిస్తే కాపులు గెలిచినట్లే అని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తనకు అందరు అండగా నిలబడండని బతిమలాడు కోవటమే విచిత్రంగా ఉంది. నాయకుడు అన్నవాడు జనాలందరికీ తాను అండగా ఉంటానని భరోసా ఇస్తాడు. అంతేకానీ తనకు అందరు అండగా నిలబడండని బతిమలాడుకోడు.



ఇక్కడ ట్వీట్లో మరో కీలకమైన  పాయింట్ ఏమిటంటే కాపులు తనను నాయకుడిగా గుర్తించటంలేదని పవనే స్వయంగా అంగీకరించటం. సొంత సామాజికవర్గం కాపుల్లోనే నాయుడిగా  నమ్మకం కలిగించలేని పవన్ను మిగిలిన సామాజికవర్గాలు ఎలా నమ్ముతాయి. అలాగే పవన్ను కాపులే నాయకుడిగా గుర్తించనపుడు మిగిలిన సామాజికవర్గాలు ఎందుకు గుర్తించాలి ? తన చేతకాని తనాన్ని తనంతట తానే పవన్ బయటపెట్టుకున్నారు.



శని, ఆదివారాల్లో బీసీలు, కాపులతో జరిగిన సమావేశాల్లో వైసీపీకి ఓట్లేయద్దని గట్టిగా చెప్పారు. ఇదే సమయంలో జనసేనకు ఓట్లేయమని ఎందుకు అడగలేదు ? ఎవరైనా ముందు తనకు ఓట్లేయమని అడుగుతారు కానీ ఎదుటివాడికి ఓట్లేయద్దని చెప్పరు. కానీ పవన్ మాత్రం జనసేనకు ఓట్లేసి గెలిపించమని ఎక్కడా అడగటంలేదు. ఇక్కడే అందరికీ పవన్ రాజకీయంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. పవన్ రాజకీయమంతా కేవలం చంద్రబాబునాయుడు ప్రయోజనాలు కాపాడటం కోసమే అన్న విషయంపై పూర్తి క్లారిటి వచ్చేస్తోంది.  ఈ క్లారిటి కాపు సామాజికవర్గంలో కూడా ఉండటం వల్లే పవన్ను నాయకుడిగా గుర్తించటంలేదు. ఆ నిజాన్ని పవనే ఇంకా గుర్తించలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: