గోదావరి : పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తారా ?

Vijaya


రాబోయే ఎన్నికల్లో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల నుండి పోటీచేయబోతున్నారా ? అవుననే సమాధానం వినిపిస్తోంది పార్టీ వర్గాల నుండి. ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుబాటులోని సమాచారం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల నుండి పోటీచేయాలని పవన్ డిసైడ్ అయ్యారట. ఈ మేరకు పై నియోజకవర్గాల్లోని కొందరికి పవన్ నుండి సంకేతాలు అందాయని సమాచారం.



ఇక్కడే పవన్ వైఖరిపై చర్చ కూడా మొదలైంది. పోయిన ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీచేసిన పవన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లోనే రెండు చోట్లనుండి కాకుండా ఏదో ఒకచోట నుండి పోటీచేసుంటే గెలిచుండేవారేమో. పవన్ గెలుపుకు చంద్రబాబునాయుడు సహకరించినా కాలం, జనాలు సహకరించలేదు. రెండుచోట్లా సరిగా దృష్టిపెట్టలేక, మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయలేక పవన్ చేతులెత్తేశారు.



మరీ నేపధ్యంలో అప్పుడు చేసిన తప్పునే రేపటి ఎన్నికల్లో కూడా పవన్ రిపీట్ చేయబోతున్నారా అనే చర్చ పెరిగిపోతోంది. రెండు నియోజకవర్గాల్లో పోటీచేసి గెలవటం అంటే మామూలు విషయంకాదు. ఎందుకంటే నామినేషన్ వేసిన దగ్గర నుండి పోలింగుకు మధ్య ప్రచార సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఇంతతక్కువ వ్యవధిలోనే 175 నియోజకవర్గాల్లోను ప్రచారం చేయాలంటే అధినేతలకు చాలా కష్టం. అందుకనే అవకాశం ఉన్న చోట్ల ముందే అభ్యర్ధులను ఫైనల్ చేసేస్తారు.



కానీ జనసేనలో పరిస్ధితి అదికాదు. ఎన్నికలకు వారం రోజుల ముందు మాత్రమే పొత్తులను ఫైనల్ చేస్తానని స్వయంగా పవనే ప్రకటించారు. అంటే అప్పటివరకు పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధులు ఎవరో తెలీదు. కాబట్టి అప్పుడు ఖాయంచేసినా అభ్యర్ధులకు ప్రచారానికి సమయం ఉండదు. ఒకచోట పోటీచేసేవారికే ప్రచారానికి సమయం సరిపోన్నపుడు రెండుచోట్ల పోటీచేయాలని అనుకుంటున్న,  173 నియోజకవర్గాల్లోను ప్రచారం చేయాల్సిన పవన్ కు సమయం ఎలా సరిపోతుంది. మళ్ళీ రెండు నియోజకవర్గాల్లో పోటీచేయటమే ఖాయమైతే పవన్ చాలా ధైర్యం చేస్తున్నట్లే లెక్క. మరి ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: