అమరావతి : పవన్ పై అనుమానాలు పెరిగిపోతున్నాయా ?

Vijaya





జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనపై సోదరుడు నాగబాబుకు కూడా నమ్మకం లేనట్లుంది. అందుకనే వచ్చేఎన్నికల్లో జనసేనకు ఎవరితో పొత్తు ఉంటుందనే విషయాన్ని సమయం వచ్చినపుడు తేలుస్తామని చెబుతున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల పర్యటనల్లో ఇదే విషయాన్ని నాగబాబు చెప్పటం గమనార్హం. టీడీపీతో పొత్తు విషయంలో  పవన్ ఆలోచనలో ఏమన్నా తేడా వస్తోందా ?  ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పొత్తు విషయంలో నాగబాబు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ-జనసేన మిత్రపక్షమన్న విషయం అందరికీ తెలుసు.



ఇక టీడీపీ పొత్తు సంగతంటారా ఆ విషయాన్ని స్వయంగా పవనే ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా రణస్ధలం బహిరంగసభలో పవన్ మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. కాకపోతే ఒక ట్యాగ్ లైన్ లాగ గౌరవ మర్యాద తగ్గకుండా ఉంటే అని ముందుజాగ్రత్తగా చెప్పారు. ఇక్కడ గౌరవ, మర్యాదంటే తనను సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని పవన్ కండీషన్ పెట్టారా ? కండీషన్ కు చంద్రబాబు అంగీకరించకపోతే ఒంటరిపోటీకి పవన్ రెడీ అవుతున్నారా అనే డౌట్ పెరిగిపోతోంది.



మామూలుగా అయితే టీడీపీతో పొత్తుపెట్టుకుని పోటీచేయటం తప్ప పవన్ కు వేరే దారేలేదు. పొత్తుల్లో జనసేన పోటీచేయబోయే సీట్ల సంగతి పక్కనపెట్టేస్తే ముందు పవన్ గెలుపు చాలా ముఖ్యమైపోయింది. ఎక్కడినుండి పోటీచేసినా తాను గెలిచి తీరాల్సిన అగత్యం పవన్ ముందుంది. లేకపోతే వైసీపీ ర్యాగింగును తట్టుకునే స్ధితిలో పవన్ లేరన్నది వాస్తవం. అందరికీ కళ్ళకు కనబడుతున్న వాస్తవాలు ఇదైతే నాగబాబేమో కొత్తగా జనసేనతో ఎవరికి పొత్తుంటుందనే విషయాన్ని చెబుతానని చెప్పటమే విచిత్రంగా ఉంది.




పొత్తుపై పవన్ బహిరంగంగా ప్రకటించిన తర్వాత కూడా నాగబాబు మళ్ళీ పొత్తుపై పవన్ ప్రకటిస్తారని చెప్పటంలో అర్ధమిదేనా ? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పనవన్ ప్రకటించినా చంద్రబాబు అండ్ కో నుండి ఎలాంటి సానుకూలత రాకపోవటం. అందుకనే తన కండీషన్ కు చంద్రబాబు ఒప్పుకుంటే అప్పుడు బీజేపీతో విడిపోయే అంశాన్ని ప్రకటిస్తారేమో.  నాగబాబు మాటలకు అర్ధమిదేనేమో. నాగబాబు ప్రకటనకు, తాజాగా ఉండవల్లి ప్రకటనకు లింకు పెడితే పొత్తుపై పవన్ యూటర్న్ తీసుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదనే అనిపిస్తోంది. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: