అమరావతి : ప్రతిపక్షాలను పవనే ముంచేస్తారా ?

Vijayaజనసేన అధినేత పవన్ కల్యాణ్ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో వారాహి వెహికల్ కు పూజలు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో పోటీ విషయమై మూడు ఆప్షన్లు చెప్పారు. మొదటిదేమో బీజేపీతో కలిసి వెళ్ళటం. బీజేపీతో కాదంటే ఒంటరిగా  పోటీచేయటం. ఈ రెండు ఆప్షన్లను పవన్ ఎప్పటినుండో చెబుతున్నదే. అయితే మూడో ఆప్షనే విచిత్రంగా ఉంది.
ఇంతకీ ఆ మూడో ఆప్షన్ ఏమిటంటే కలిసొచ్చే కొత్తపార్టీలతో కొత్తపొత్తులు పెట్టుకుంటారట. కలిసొచ్చే కొత్తపార్టీలు ఏమిటో, కొత్తపొత్తులు ఏమిటో పవన్ కే తెలియాలి. ఇప్పటికే పవన్ కాంగ్రెస్ తో తప్ప మిగిలిన అన్నీ పార్టీలతో పొత్తులు పెట్టేసుకున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి మిత్రపక్షంగా పనిచేశారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఇద్దరిని వదిలేశారు. సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో పొత్తులు పెట్టుకుని పోటీచేశారు. ఎన్నికల్లో తిన్న దెబ్బ కారణంగా వెంటనే బీజేపీతో పొత్తు పెట్టేసుకున్నారు.
జనసేన-బీజేపీ మిత్రపక్షాలే అయినా రెండుపార్టీల మధ్య సఖ్యత ఎక్కడా కనబడదు. అందుకనే దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన  స్ధానిక సంస్ధల ఎన్నికల్లో చాలా చోట్ల టీడీపీతో అవగాహనతో కలిసి పోటీచేశారు. మిత్రపక్షంగా బీజేపీ ఉన్నా ఎలాంటి సంబంధంలేని టీడీపీతో అవగాహన పేరుతో కలిసి  పోటీచేయటమే విచిత్రం. సో గ్రౌండ్ లెవల్లో చూస్తే పవన్ పొత్తు పెట్టుకోని పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.
వాస్తవం ఇలాగుంటే కొత్తపార్టీలతో కొత్తపొత్తులు పెట్టుకుంటామని పవన్ ప్రకటించటంలో అర్ధమేంటి ? ఒకపుడు శాపనార్ధాలు పెట్టిన కాంగ్రెస్ తో కూడా పొత్తుకు పవన్ రెడీ అయిపోతున్నారా ? అనే సందేహం పెరిగిపోతోంది. అలాకాకుండా బీజేపీతోనే కంటిన్యు అయితే ఇది కొత్తపార్టీ కాదు కొత్తపొత్తూ కాదు. పోనీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అనుకుంటే ఆ విషయాన్ని చెప్పలేదు. అయితే ఈమధ్యనే రణస్ధలంలో జరిగిన బహిరంగసభలో టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు ప్రకటించారు. మరి తాజాగా కొత్తపార్టీలతో కొత్తపొత్తులు పెట్టుకుంటామని చేసిన ప్రకటనకు అర్ధమేంటి ? అసలు కొత్తపార్టీలు ఏమున్నాయి ?
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: