అమరావతి : వైసీపీలో పవన్ కు ఫుల్లు డిమాండ్

Vijaya


వచ్చేఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పోటీచేయటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ మధ్యనే సినీనటుడు, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ మాట్లాడుతు పవన్ పై పోటీచేయటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇక పోయిన ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పవన్ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి వచ్చేఎన్నికల్లో కూడా పవన్ తమపైనే పోటీచేసి గెలవాలని చాలెంజులు విసిరారు.



అంటే రాబోయే ఎన్నికల్లో పవన్ పై పోటీచేయటానికి  ఇప్పటికి వైసీపీలో నలుగురు రెడీగా ఉన్నట్లు అర్ధమవుతోంది. భవిష్యత్తులో ఇంకెంతమంది రెడీ అవుతారో తెలీదు. అసలు ఇంతమంది పవన్ పై పోటీకి ఎందుకు రెడీ అవుతున్నట్లు ?  వీళ్ళ వైఖరి చూస్తుంటే పవన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నట్లే ఉంది. పోయిన ఎన్నికల్లో అంటే గుడ్డెద్దు లాగ ఎన్నికల గోదాలోకి దూకి జనసేన దెబ్బతిన్నది వాస్తవమే. అంతేకానీ వచ్చేఎన్నికల్లో కూడా అదే పద్దతిలో ఎన్నికల్లోకి దిగుతుందని అనుకోవటం తప్పు.



ఒంటరిగా పోటీచేసినా, బీజేపీతో మాత్రమే పొత్తుతో ఎన్నికలకు దిగితే పోయిన ఎన్నికల రిజల్టే రిపీటైనా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆ విషయాన్ని పవన్ గ్రహించారు. అందుకనే బీజేపీతో ఉంటూనే  టీడీపీతో పొత్తుకు రెడీఅయిపోయారు. టీడీపీ-జనసేన కలిస్తే వచ్చేఎన్నికల్లో గెలుపు ఖాయమని కొందరు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఎంతమంది కలిసినా తమ విజయానికి ఎలాంటి ఢోకా లేదని జగన్మోహన్ రెడ్డి అండ్ కో బలంగా నమ్ముతున్నారు.



ఈ నేపధ్యంలోనే వైసీపీ నేతలు ఇంతమంది పవన్ పై పోటీచేయటానికి రెడీ అవటం ఆశ్చర్యంగానే ఉంది. వీళ్ళ ప్రకటనలను బట్టి వైసీపీలో పవన్ కు బాగా డిమాండ్ ఉన్నట్లే అనుకోవాలి. ఎందుకింత డిమాండ్ అంటే పవన్ పై ఎవరు పోటీచేసినా ఈజీగా గెలుస్తారని అంచనా వేసుకుంటున్నట్లున్నారు. పవన్ ఎక్కడ పోటీచేసినా  కాపు(బలిజ)ల్లో ఒక సెక్షన్+నాన్ కాపులంతా పవన్ కు వ్యతిరేకంగా ఓట్లేస్తారనే ప్రచారం జరుగుతోంది. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారపార్టీ నేతలు ఇంతమంది పవన్ పై  పోటీకి సై అంటున్నట్లున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: