హైదరాబాద్ : ఇందుకేనా బీఆర్ఎస్ గురించి మాట్లాడంది ?

Vijaya





జాతీయపార్టీ బీఆర్ఎస్ గురించి కేసీయార్ మాట్లాడి చాలాకాలమైంది. ఎంతో అట్టహాసంగా ప్రాంతీయపార్టీ టీఆర్ఎస్ ను జాతీయపార్టీగా మారుస్తున్నట్లు దాదాపు రెండునెలల క్రితం కేసీయార్ ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రకటించే ముందు తర్వాత కూడా నానా హడావుడిచేశారు.  తర్వాత కొద్దిరోజులకు సడెన్ గా అసలా ప్రస్తావనే మానేశారు. కారణం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూతురు కల్వకుంట్ల కవిత ప్రస్తావన వినబడటం.




దీంతో పాటు టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎంఎల్ఏలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందనే ఆరోపణలు. హైదరాబాద్ లోని ఒక ఫాంహౌస్ లో రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ అనే ముగ్గురు ఎంఎల్ఏల కొనుగోళ్ళకు బేరసారాలాడారు. వీళ్ళకి బీజేపీతో సంబంధాలున్నాయో లేదో తెలీదు. వీళ్ళని అసలు ఎంఎల్ఏల కొనుగోళ్ళకు ఎవరు పురమాయించారో కూడా తెలీదు.



రు. 100 కోట్లకు బేరాలాడారనే ఆరోపణలు వినబడుతున్నాయి కానీ అంత డబ్బును ఎవరు సర్దుబాటు చేస్తున్నారో కూడా తెలీదు. పైగా ఎంఎల్ఏలని పిలిపించుకుని బేరాలాడేసమయంలో అసలు వీళ్ళెవరి దగ్గరా డబ్బే లేదు. పోలీసులు రెయిడ్ చేసినపుడు కూడా డబ్బులు దొరకలేదు. మరి తమ ఎంఎల్ఏలను కొనేందుకు బేరాసరాలు జరిగాయని కేసీయార్ ఎలా ఆరోపిస్తున్నారో తెలీదు. ఏవో ఆడియో, వీడియో టేపులు దొరికాయని చెప్పారు. అవి కోర్టు విచారణలో సాక్ష్యాలుగా ఎంతవరకు పనికొస్తాయో తెలీదు. దాదాపు నెలరోజుల నుండి ఈ హడావుడే ఎక్కువగా ఉంది.




బీజేపీ నేతలను పట్టుకునేందుకు కేసీయార్ సిట్ విచారణ పేరుతో దూకుడు పెంచేకొద్దీ తన మంత్రివర్గ సహచరులపై కేంద్ర దర్యాప్తు సంస్ధలు విరుచుకుపడుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి మీద ఐటి అధికారులు దాడులు చేయటం, కోట్ల రూపాయలు స్వాదీనం చేసుకోవటం అందరు చూసిందే. ఇలాంటి అనేక కారణాల వల్ల కేసీయార్ అసలు జాతీయపార్టీ ఊసెత్తటమే మానేసినట్లున్నారు. ముందు తెలంగాణాను చక్కబెట్టుకుని తర్వాత ఢిల్లీ సంగతి చూద్దామని అనుకున్నారేమో. ఎలాగూ ఎన్నికలు వస్తున్నాయి కదా తెలంగాణాలో హ్యాట్రిక్ కొడితేనే జాతీయస్ధాయిలో గుర్తింపుంటుంది. లేకపోతే చంద్రబాబునాయుడు లాగ అయిపోతారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: