హైదరాబాద్ : మునుగోడు రిజల్టుతో కాంగ్రెస్ హ్యాపీగా ఉందా ?

Vijayaమునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. ఎంతచిత్తుగా అంటే చివరకు డిపాజిట్టు కూడా తెచ్చుకోలేకపోయింది. మరింత చిత్తుగా ఓడిపోతే ఇక హ్యపీ ఏముంది అనే సందేహం వస్తోందా ? అసలు ట్విస్టంతా ఇక్కడే ఉంది. అదేమిటంటే పార్టీ అభ్యర్ధి  గెలిచే అవకాశాలు లేవని తేలిపోయిన తర్వాత  బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలవకూడదని కాంగ్రెస్ సీనియర్ నేతలు అనుకున్నారట. వాళ్ళ కోరిక ఫలించి చివరకు టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో రాజగోపాలరెడ్డి 10,309 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతు తాము గెలవకపోయినా బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి ఓడిపోయినందుకు హ్యాపీగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని మోసంచేసిన రాజగోపాలరెడ్డి గెలవకూడదని పార్టీలోని చాలామంది నేతలు కోరుకున్నట్లు జీవన్ రెడ్డి చెప్పారు. వాళ్ళు కోరుకున్నట్లుగానే కోమటిరెడ్డి ఓడిపోయారు. అందుకనే కాంగ్రెస్ హ్యాపీ అంటున్నది. నిజానికి మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి గెలుస్తారని ఎవరిలోను నమ్మకంలేదు.ఎంతో బలమైన అభ్యర్ధిగా ప్రచారం జరిగిన కోమటిరెడ్డి గెలుస్తారనే నమ్మకం చివరలో సడలిపోయింది. అలాంటిది పోటీచేసిన ప్రధానపార్టీ అభ్యర్ధుల్లో పాల్వాయి అత్యంత బలహీనమైన అభ్యర్ధి.  పైగా పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెన్నుపోటు పొడిచారు. కొందరు సీనియర్లు పనిచేశారంటే చేశారనిపించారంతే. రాహుల్ గాంధి పాదయాత్ర కారణంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కొద్దిరోజులు  అందుబాటులో లేరు.
ఇలాంటి అనేక కారణాల వల్ల స్రవంతి ఓటమి ఖాయమని అందరికీ అర్ధమైపోయింది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి కాకుండా టీఆర్ఎస్ కు పడినట్లు ప్రచారం కూడా మొదలైంది. తాము ఓడిపోయినా 30 వేల ఓట్లొస్తే గౌరవప్రదంగా ఉంటుందని కొందరు సీనియర్లు అనుకున్నారు. కానీ చివరకు డిపాజిట్టే పోతుందని మాత్రం అనుకోలేదు. ఇద్దరు బలమైన అభ్యర్ధుల మధ్య కాంగ్రెస్ అభ్యర్ధి పరిస్ధితి అన్యాయం అయిపోయిందన్నది వాస్తవం. అందుకనే తమపార్టీ ఓడిపోయినా కోమటిరెడ్డి ఓటమి కారణంగా కాంగ్రెస్ నేతలు హ్యాపీగా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: