హైదరాబాద్ : కేసీయార్ అసలు మూలాన్నే వదిలేశారా ?

Vijaya


పార్టీ పుట్టుకకు, ఎదుగుదలకు, తాను రెండుసార్లు ముఖ్యమంత్రి అవటానికి మూలమైన తెలంగాణా అన్న పదాన్నే కేసీయార్ పూర్తిగా వదిలేశారు. తెలంగాణా అన్నపదాన్ని పట్టుకోకపోతే  కేసీయార్ లేరన్నది వాస్తవం. తనకెంతో ఉన్నతినిచ్చి, జాతీయస్ధాయిలో గుర్తింపునిచ్చిన తెలంగాణా వాదాన్ని సీఎం పూర్తిగా విడిచిపెట్టేశారు. తెలంగాణా రాష్ట్రసమితి అనే ప్రాంతీయ పార్టీని భారత రాష్ట్ర సమితి అనే జాతీయపార్టీగా మార్చేశారు.అంటే టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ అన్నది అప్ డేటెడ్ వర్షన్ అన్నమాట. తెలంగాణా వాదాన్ని, పదాన్ని వదిలేస్తే భవిష్యత్తులో తనకు ఇబ్బందులు ఎదురవుతాయని కేసీయార్ అనుకోవటంలేదేమో. పైగా తెలంగాణాలో ఉన్నంతవరకు టీఆర్ఎస్ చెల్లుబాటవుతుంది కానీ జాతీయస్ధాయిలో బీఆర్ఎస్సే కరెక్టని అనుకున్నట్లున్నారు. మామూలు జనాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అంశాలను కేసీయార్ ఆలోచించకుండానే  ఉంటారా ? మరి ఈ విషయంలో జనాల ఆలోచన ఎలాగుంటుందో చూడాలి. ఏదేమైనా పుట్టిన 21 ఏళ్ళ తర్వాత తెలంగాణా వాదం  కేసీయార్ దగ్గర మరుగునపడిపోయింది. ఇదే విషయమై పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతు తెలంగాణాకు కేసీయార్ కుటుంబానికి బంధం విడిపోయిందని ఎద్దేవాచేశారు. దోచుకోవటానికి, దాచుకోవటానికి తెలంగాణాలో ఇక ఏమీ మిగలలేదని అర్ధమైన తర్వాతే కేసీయార్ తెలంగాణాను వదిలేశారన్నారు. ఏదైనా కానీ ఇంతకుముందు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి చక్రంతిప్పాలని అనుకున్న ఇద్దరు నేతలు ఘోరంగా ఫెయిలయ్యారన్న విషయాన్ని కేసీయార్ గుర్తుంచుకోవాలి.
మొదట ఎన్టీయార్ కూడా ఇలాగే వ్యవహరించారు. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా దేశంలో చక్రంతిప్పాలని అనుకున్నారు. కానీ చివరకు రాష్ట్రంలోనే అధికారం కోల్పోయారు. దాంతో బేస్ పడిపోవటంతో జాతీయస్ధాయిలో కూడా ఇమేజ్ పడిపోయింది. అలాగే చంద్రబాబునాయుడు కూడా నేషనల్ ఫ్రంటని, ఎన్డీయే అని జాతీయరాజకీయాల్లో చాలా బిజీగా ఉండేవారు. కానీ చివరకు ఏమైంది రాష్ట్రంలో ఓడిపోయారు. దాంతో అక్కడా ఇక్కడా రెండుచోట్లా దెబ్బపడిపోయింది. కాబట్టి ఇఫుడు కేసీయార్ రెండు కేస్ షీట్లను జాగ్రత్తగా గమనించి అడుగులు వేయాలి. లేకపోతే రెండు చోట్లా దెబ్బపడటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: