గోదావరి డేంజర్ బెల్స్.. నెల రోజుల వ్యవధిలో రెండోసారి..

Deekshitha Reddy
గోదావరికి వరదలు రావడం, ముంపు ప్రాంతాల ప్రజలు తరలిపోవడం సహజమే అయినా నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇలాంటి అపాయం రావడం మాత్రం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. జులై నెలలో ప్రజలను వణికించిన గోదావరి, మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే భద్రాచలం వద్ద నీటిమట్టం 50 అడుగులకు చేరుకోవడంతో రెండు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు, ఈరోజు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి నీరు చేరుకుంటుందనే అంచనాలున్నాయి.
గత నెలలో వచ్చిన వరదలతో అశ్వాపురం, బూర్గంపాడు, పినపాక, మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దాదాపుగా 16వేల కుటుంబాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. 77 పునరావాస కేంద్రాలను వారికోసం ఏర్పాటు చేశారు అధికారులు. వందల కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు చెబుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. భద్రాచలం వద్ద స్నానఘట్టాల్లోని విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి.
అటు దుమ్ముగూడెం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో పర్ణశాల వద్ద వరదనీరు చేరింది. పర్ణశాల వద్ద ఉన్న స్నానఘట్టాలు నీట మునిగాయి. సీతమ్మ నార చీరల ప్రదేశం, స్వామివారి సింహాసనం కూడా నీటమునిగాయి. దీంతో అక్కడ ఉన్న దుకాణాల వ్యాపారులు షాపులను ఖాళీ చేసి తరలి వెళ్తున్నారు. డొంకవాగు కూడా పొంగడంతో సున్నంబట్టి- బైరాగులపాడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రదాన రహదారి నీటమునిగింది. దీంతో పడవలపైనే ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు.
బూర్గంపాడు గ్రామస్తులకు వరద హెచ్చరిక..
ఇటీవల గోదావరి వరద ప్రభావానికి బూర్గంపాడు మండలం తీవ్ర ప్రభావానికి గురైంది. బూర్గంపాడు మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. ఇప్పుడు మరోసారి వరద నీరు ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో బూర్గంపాడు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటు కలెక్టర్ కూడా ముందస్తు హెచ్చరికలు చేశారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: