కుప్పంనుంచి చంద్రబాబు పారిపోవాల్సిందేనా..?

Deekshitha Reddy
టీడీపీకి కుప్పం కంచుకోట. అందుకే అక్కడినుంచి చంద్రబాబు వరుసగా గెలుస్తూ వచ్చారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. కుప్పంలో మాత్రం టీడీపీదే గెలుపు, చంద్రబాబే ఎమ్మెల్యే. ఇలా ఉంది ఇప్పటి వరకు. కానీ ఈ చరిత్ర తిరగరాసేందుకు సిద్ధమయ్యారు జగన్. కుప్పంలో గెలిచి తీరాలంటూ వైసీపీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. కుప్పం అభివృద్ధి పనులకు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో కూడా కుప్పంకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. కుప్పంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ది జరిగి తీరుతుందని రాబోయే రెండేళ్లలో మరిన్ని స్పష్టమైన తేడాలు కనిపిస్తాయని, కుప్పం విషయంలో రాజీపడేదే లేదన్నారు.
భరత్ కి మంత్రి పదవి..
కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయబోయే వైసీపీ అభ్యర్థి భరత్ కి కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారు జగన్. కుప్పం నుంచి ఈ దఫా భరత్ ని గెలిపించుకుని వస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. కుప్పం మున్సిపాల్టీ అభివృద్ధికి 2 రోజుల్లో రూ.65 కోట్లు మంజూరు చేస్తానన్నారు జగన్. కుప్పంను తన సొంత నియోజకవర్గంగా భావిస్తానని, కుప్పం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తానన్నారు జగన్.
సీఎంగా చంద్రబాబు చేసిన అభివృద్ధి కంటే కుప్పం నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో ఇప్పుడు దాదాపు రెట్టింపు అభివృద్ధి జరిగిందని, జరుగుతోందని చెప్పారు సీఎం జగన్. భరత్‌ అడిగాడు, సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్నాడు.. ఇది ఫిక్స్ అని అన్నారు జగన్. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పని ఏడాదిలోపు పూర్తి చేస్తామని కుప్పంకు కృష్ణా జలాలు తెస్తామని, ఆ ఘనత వైసీపీకే దక్కుతుందని, ఆ తర్వాత ఎన్నికల్లో ఓట్లు మనకే పడతాయని చెప్పారు. కుప్పంలో వరుసగా చంద్రబాబు గెలవడానికి కారణం.. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారని, తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే భ్రమలో అక్కడి ప్రజలు ఉండటమేనన్నారు జగన్. కానీ ఇకపై చంద్రబాబు సీఎం అయ్యే అవకాశమే లేదని, అంటే.. అక్కడ ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు గెలవాల్సిన అవసరం లేదని, అక్కడ భరత్ ని గెలిపించుకుని వస్తే, కచ్చితంగా మంత్రి అవుతారని కార్యకర్తలు, నేతలకు భరోసా ఇచ్చారు జగన్. 175 నియోజక వర్గాల్లో వైసీపీ జెండా ఎగరేయాలంటున్న జగన్, అది కుప్పంతోటే మొదలు కావాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: