హైదరాబాద్ లో వరద బీభత్సం..

Deekshitha Reddy
హైదరాబాద్ ని భారీ వర్షాలు వదిలిపెట్టేలా లేవు. వర్షాల కారణంగా నాలాలు పొంగి పొర్లడంతో రోడ్లపై వరదనీరు ప్రవహించింది. మూసీ ప్రవాహం తగ్గుతుందనుకుంటున్న టైమ్ లో మరోసారి వర్షాలతో హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. శుక్రవారం దాదాపు 2 గంటలసేపు వర్షం దంచి కొట్టింది. దీంతో నగర జీవనం మరోసారి స్తంభించింది. చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.ఉదయం నుంచి ఎండ ఉన్నా.. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్మేశాయి, వర్షం కుమ్మేసింది. 2 గంటలసేపు ఏకధాటిగా కురిసిన కుంభవృష్టితో హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. కీసర, ఇబ్రహీంపట్నం, మల్కాజ్ గిరి, ఆనంద్ బాగ్, సింగపూర్ టౌన్ షిప్.. ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కీసర మండ లం బండ్లగూడలో అత్యధికంగా 10.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 9.7 సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్టు అధికారులు చెబుతున్నారు.
మరో రెండురోజులు వర్షాలు వదలవు..
తెలంగాణలలో మరో రెండు రోజులు భారీ వర్షాలుంటాయని చెబుతున్నారు అధికారులు. శని, ఆదివారాల్లో కూడా కుంభవృష్టి కురిసే అవకాశముందని అంటున్నారు. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. మరోవైపు గోదావరి, కృష్ణా బేసిన్‌ లోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకి వరద ప్రవాహం గణనీయంగా తగ్గింది. గురువారం వరద ప్రవాహం 88 వేల క్యూసెక్కులు ఉండగా, శుక్రవారం కేవలం 31వేల క్యూసెక్కులు మాత్రమే వరదనీరు వచ్చింది. అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎల్లంపల్లి నిజాంసాగర్, ఎల్ఎండీ, కడెం ప్రాజెక్ట్ లకు కూడా వరదనీరు క్రమంగా తగ్గిపోతోంది. దీంతో గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: