బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్‌?

Chakravarthi Kalyan
బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ దూసుకుపోతోంది. టీఆర్ఎస్‌కు గట్టి సవాల్ విసురుతోంది. వాస్తవానికి టీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో పోలిస్తే బీజేపీకి అంత క్యాడర్ లేకపోయినా.. ఆ పార్టీలకు దీటుగా పార్టీని బండి సంజయ్ నడిపిస్తున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరిట ఆయన చేసిన పాద యాత్ర పార్టీకి ప్లస్ పాయింట్ అయ్యింది. దీన్ని ప్రధాని మోదీ కూడా గుర్తించినట్టున్నారు. అందుకే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఫోన్‌ చేసి మాట్లాడారు.

శభాష్‌ బండీ.. పార్టీ కోసం బాగా పనిచేస్తున్నారు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రజాసంగ్రామ యాత్ర జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తుక్కుగూడ సభ గురించి ప్రధాని మోదీ ఆరా తీశారు. బాగా చేశారని బండి  సంజయ్‌ని మోదీ అభినందించారు. రెండో విడత ప్రజా సంగ్రామ  యాత్రను శనివారం పూర్తి చేసుకున్న బండి సంజయ్‌ నిన్న ఖమ్మంలోని  సాయి గణేశ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్లారు. ఆయన ఖమ్మం వెళ్తుండగా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు.

బండి సంజయ్ పాదయాత్రలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అలాగే యాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు తన తరపున అభినందనలు తెలపాలని ప్రధాని మోదీ సూచించారు. రెండు విడతల్లో  770 కిలోమీటర్లు నడిచానని.. మీ స్ఫూర్తితో.. మీ సూచనలతోనే పాద యాత్ర చేపట్టానని ప్రధానికి బండి సంజయ్‌ చెప్పారు. అంతే కాదు.. నడిచింది నేనైనా నడిపించింది మీరే అంటూ వినమ్రంగా చెప్పారు.

మీరు చెప్పిన సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌, సబ్‌ కా ప్రయాస్‌ పాలన తెలంగాణలో  తెచ్చేందుకు తాను పాద యాత్ర చేస్తున్నానని... కేసీఆర్‌ పాలనపై ఇక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బండి సంజయ్ మోదీకి చెప్పారు. అమిత్‌ షా, జె.పి.నడ్డాల రాకతో బీజేపీ కార్యకర్తల్లో జోష్‌ పెరిగిందని బండి సంజయ్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: