ఏపీలో సచివాలయ వ్యవస్థపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే..?

Deekshitha Reddy
ఏపీలో సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టి, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో ప్రభుత్వ సేవలను ప్రజల దగ్గరకు చేర్చిన ఘనత కచ్చితంగా సీఎం జగన్ కే దక్కుతుంది. గతంలో సచివాలయాలు ఉన్నా కూడా ప్రజలు ఈ స్థాయిలో వాటి సేవలను వినియోగించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా గ్రామంలో ఉన్న సచివాలయానికి వెళ్తారు, ఏ పథకం పై అనుమానం ఉన్నా సచివాలయానికి వెళ్లి నివృత్తి చేసుకుంటారు. ఇలాంటి ఈ సచివాలయ వ్యవస్థను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ప్రశంసించారు. ఏపీలో ఉన్న సచివాలయ వ్యవస్థ అద్భుతమని అన్నారాయన. అంతే కాదు, ఏపీలో సచివాలయాల వ్యవస్థ పనితీరుని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు కేంద్ర మంత్రి.
ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ.. రైతు భరోసా కేంద్రాలపై కూడా ప్రశంసల జల్లు కురిపించారు. రైతులకు ఎరువులతో పాటు వ్యవసాయానికి సంబంధించిన సేవలను గ్రామ స్థాయిలోనే అందించడం, గ్రామాల్లోనే వారికి నాణ్యమైన సేవలు అందుబాటులో ఉండటం అభినందించతగ్గ విషయం అని అన్నారు. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన జగనన్న లేఅవుట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జగనన్న లే అవుట్లలో నిర్మిస్తున్న కాలనీలకు ఇంటింటికీ వంట గ్యాస్ ను పైప్ లైన్ల ద్వారా పంపిణీ చేసే అవకాశాన్ని పరిశీలించాలని చెప్పారు కేంద్ర మంత్రి.
జగనన్న హౌసింగ్‌ కాలనీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ అన్నారు. అయితే అదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం జగనన్న కాలనీల విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రదాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిధులు మళ్లిస్తూ పేరు మాత్రం జగనన్న కాలనీలు అని పెట్టుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు గతంలోనే వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి మాత్రం జగనన్న కాలనీలపై సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. అక మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని కూడా ఆయన అభినందించారు. విజయనగరం జిల్లాలో పీడియాట్రిక్ ఐసీయూ సేవలను కేంద్ర మంత్రి ప్రారంభించారు. మహారాజా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకోసం ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: