అమరావతి : పవన్ను నడిపిస్తున్నదెవరో అర్ధమైందా ?

Vijaya



జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వెనకనుండి నడిపిస్తున్నదంతా చంద్రబాబునాయుడే అని ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అండ్ కో చెబుతున్నారు. నిజంగా పవన్ వెనుక చంద్రబాబు ఉన్నారా లేదా అన్నది పక్కనపెట్టేస్తే మరో వ్యక్తి ఉన్నట్లు తాజాగా అర్ధమైంది. ఆ రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజే. చంద్రబాబు విషయాన్ని జనాలు నమ్మినా నమ్మకపోయినా రఘురాజు విషయాన్ని మాత్రం అందరు నమ్మితీరాల్సిందే.



ఎందుకంటే తనకు సలహాలిస్తున్నది, గైడ్ చేస్తున్నది రఘురాజే అని స్వయంగా పవనే చెప్పారు కాబట్టి. అనంతపురం జిల్లా పర్యటన తర్వాత జగన్ పై తానుచేసిన కొన్ని ఆరోపణలు, విమర్శల తర్వాత రఘురాజు తనతో మాట్లాడినట్లు చెప్పారు. తాను చేసిన విమర్శలు తప్పని చేయాల్సింది ఇది అని రఘురాజే తనకు కొన్ని విషయాలను చెప్పినట్లు పవన్ అన్నారు. అంటే జగన్ పై పవన్ ఆరోపణలు, విమర్శల వెనుక రఘురాజు ఉన్నట్లు అర్ధమవుతోంది.



అంటే జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబు+ఎల్లోమీడియా+రఘురాజు+పవన్  కలిశారన్నమాట. ఒకవ్యక్తికి వ్యతిరేకంగా ఇంతమంది కలిశారంటేనే సదరు వ్యక్తి ఎంత బలవంతుడో అర్ధమైపోవటంలేదా. తనకు వైసీపీ అంటే వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని చెబుతున్న పవన్ మరి జగన్ అంటేనే ఒంటికి కారం రాసుకున్నట్లుగా మండిపోయే రఘురాజుతో ఎలా కలిశారు ? 24 గంటలూ జగన్ కు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతున్న పవన్ వైఖరిని చూసిన తర్వాత ఆయన చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని ఎవరికైనా అర్ధమైపోతుంది.



జగన  కు వ్యతిరేకంగా చంద్రబాబు, రఘురాజు, ఎల్లోమీడియా ఏకమైన విషయం అందరికీ తెలిసిందే. ఇంతమంది జగన్ వ్యతిరేకులతో పవన్ చేతులు కలిపిన తర్వాత తనకు వైసీపీపై ఎలాంటి కోపం లేదని పవన్ చెబితే ఎవరైనా నమ్ముతారా ? ఒకవైపేమో జనసేనను ఒక పార్టీగా, పవన్ను ఒక రాజకీయపార్టీ నేతగా గుర్తించటానికే జగన్ ఇష్టపడటంలేదు. అలాంటిది వైసీపీ అంటే తనకు వ్యతిరేకత లేదని పవన్ చెప్పటంలో అర్ధమేలేదు. పైకి అంగీకరించినా అంగీకరించకపోయినా జగన్ అంటే మంటున్న విషయం పవన్ ప్రతి అడుగులోను తెలిసిపోతోంది. కాబట్టి ముసుగు తీసేసి డైరెక్టుగా వచ్చేయటమే బెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: