అమెరికా : అధ్యక్షుడు జో బిడెన్ కే ఐఎస్ఐ షాక్

Vijaya


దాయాది పాకిస్ధాన్ ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ఐ ఏకంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కే షాకిచ్చింది. బిడెన్ భార్య జిల్ బిడెన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది బృందంలోకి దూరేందుకు ఐఎస్ఐకి చెందిన ఇద్దరు ఏజెంట్లు చేసిన ప్రయత్నం సంచలనంగా మారింది. ఇద్దరు ఏజెంట్ల ప్రయత్నాలపై అనుమానంతో నిఘావేసిన ఎఫ్బీఐ ఏజెంట్లు వలపన్ని ఇద్దరినీ పట్టుకోవటంతో అసలు విషయం బయటపడింది.



ఇక్కడ విషయం ఏమిటంటే ఏకంగా అమెరికా అధ్యక్షుడి భార్య వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో కలిసిపోయేందుకు పాకిస్ధాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ప్రయత్నించటం అమెరికాలో కలకలం రేపుతోంది. అరియన్ తాహిర్ జాదే, హైదర్ ఆలీ ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లు. వీళ్ళద్దరు కొంతకాలంగా అమెరికాలోనే తిరుగుతున్నారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటి యూనిట్లో పనిచేస్తున్నట్లు వీళ్ళద్దరు స్ధానికులను నమ్మించారు. ఎక్కడికెళ్ళినా తమ ఐడీ కార్డులను చూపిస్తుండటంతో స్ధానికులు కూడా నమ్మేశారు.



2021లో జరిగిన క్యాపిటల్ హిల్ అల్లర్ల కేసు దర్యాప్తు కోసం అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్నట్లు వీళ్ళు చెప్పటంతో నిజమే అని అందరు నమ్మారు. ఫెడరల్ లా ఎన్ ఫోర్స్ మెంట్, డిఫెన్స్ కమ్యూనిటికి చెందిన అనేకమంది అధికారులతో పరిచయాలు పెంచుకున్నారు. వీళ్ళల్లో కొందరికి ఖరీదైన గిఫ్టులు కూడా అందించారు. వీళ్ళద్దరు వాషింగ్టన్లోని కొన్ని అపార్ట్ మెంట్లలో నివసించే వారిపై నిఘా పెట్టేవారు. వీళ్ళకు పరిచయమైన వారిద్వారా బిడెన్ భార్య జిల్ బిడెన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది బృందంలో జొరబడేందుకు ప్రయత్నించారు.




ఈ దశలోనే వీళ్ళపై అనుమానం వచ్చి ఎవరో ఎప్బీఐ అధికారులకు సమాచారం అందించారట. దాంతో వీళ్ళపై నిఘా పెట్టడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఎఫ్బీఐ వెంటనే వీళ్ళిద్దరినీ అరెస్టుచేసి విచారణ మొదలుపెట్టింది. ఒకళ్ళదగ్గర పాకిస్ధాన్, ఇరాన్ వీసాలున్నట్లు తేలింది. రెండో వ్యక్తి గతంలో ఇస్తాంబుల్, దోహా, టర్కీకి వెళ్ళొచ్చినట్లు తేలింది. అసలు వీళ్ళు అమెరికాకు ఎందుకొచ్చారు ? జిల్ బిడెన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది బృందంలో చేరటానికి ఎందుకు ప్రయత్నించారనే విషయమై దర్యాప్తు జరుగుతోంది. జిల్ బిడెన్ కు ఏమన్నా హాని చేయటమే టార్గెట్ గా వీళ్ళు అమెరికా చేరుకున్నారా అనే విషయంపై విచారణ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: