నియోజకవర్గం వేటలో పవన్.. సేఫ్ జోన్ పై మల్లగుల్లాలు

Deekshitha Reddy
పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలనుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. సీఎం సీఎం అంటూ ఆయన అభిమానులు సందడి చేస్తారే కానీ, కనీసం ఎమ్మెల్యేగా కూడా తమ నాయకుడ్ని గెలిపించుకోలేరనే అపవాదు ఉంది. దీంతో ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలనే పట్టుదలతో ఉన్నారు పవన్ కల్యాణ్. విమర్శకులకు చెక్ పెట్టేందుకు రెండేేళ్లముందుగానే సిద్ధమయ్యారు.
భీమవరం, గాజువాక.. రెండు చోట్లా గతంలో పవన్ కి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి సేఫ్ జోన్ కావాలంటే ఎక్కడికి వెళ్లాలి. మళ్లీ భీమవరం, గాజువాక ఎక్కడో ఒకచోట అదృష్టాన్ని పరీక్షించుకోవాలా లేక, కొత్త నియోజకవర్గాన్ని వెదుక్కోవాలా..? ఈ డైలమాలోనే ఉన్నారు పవన్ కల్యాణ్.
తిరుపతి సేఫేనా..?
గతంలో తిరుపతి నుంచి చిరంజీవి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి వెళ్లారు. అందులోనూ తిరుపతిలో పవన్ సామాజికవర్గానికి మంచి పట్టుంది. దీంతో ఆయన అక్కడినుంచి పోటీకి ఉత్సాహంగా ఉంటున్నారు. మరి ఫైనల్ గా అదే ఫిక్స్ అవుతుందా, మధ్యలో పవన్ మనసు మారుతుందా అనేది చూడాలి.
గాజువాకపై కూడా పవన్ కి ఆసక్తి ఉంది. అందుకే ఇటీవల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో కూడా పవన్ దూకుడుగా ఉన్నారు. కేంద్రాన్ని విమర్శించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని మండిపడుతున్నారు. పవన్ ఏపీలో మరో నియోజకవర్గాన్ని ఎంచుకున్నా, గాజువాకలో మాత్రం కచ్చితంగా పోటీ చేస్తారని స్థానిక నాయకులు ఆశపడుతున్నారు. అసలు ఈసారి పవన్ ఒకే ఒక్క నియోజకవర్గానికి ఫిక్స్ అవుతారనే ప్రచారం కూడా ఉంది. ఆ ఒక్కటీ ఏదవుతుందో చూడాలి.
పవన్ ఎక్కడినుంచి పోటీ చేసినా ఈసారి జనసైనికులు మాత్రం ఆయన్ని గెలిపించుకోడానికి దీక్ష చేపట్టారు. ముందుగానే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి సేఫెస్ట్ నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకుంటారని తెలుస్తోంది. ఎలాగూ బీజేపీ, టీడీపీ మద్దతు కూడా ఉంటుంది కాబట్టి.. ఈసారి పవన్ విజయం నల్లేరుపై నడకేనంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: