ఈ మూడేళ్లలో జగన్ జనానికి పంచిందెంతో తెలుసా?
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే చెబుతున్నారు.. ఈ ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాల కాలంలో లక్ష 37 వేల కోట్ల రూపాయల నిధులను వివిధ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో సైతం అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్యేయం అంటున్నారు మంత్రి బొత్స.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం ప్రజల తరఫున మాట్లాడింది శూన్యమని ఆరోపించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. అసెంబ్లీ సమావేశాలు 15రోజుల సమయంలో చంద్రబాబు ప్రజల కోసం పోరాడింది ఏమీ లేదన్నారు. పేదవాడి కోసం సామాన్యుల కోసం ఆలోచించే సమయం ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి లేదని.. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మా ఇంటికొస్తే ఏం తెస్తారు మా ఇంటికొస్తే ఏం ఇస్తారు అనే తరహాలో ఉంటుందని మంత్రి బొత్స విమర్శించారు.
ఏపీలో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లి పోయాయన్న మంత్రి బొత్స... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్ నెంబర్ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేశారు. ఆంధ్రరాష్ట్రంలోని నీ అడ్రస్ ఎక్కడో చెప్పాలంటూ చంద్రబాబును మంత్రి బొత్స డిమాండ్ చేశారు. అంతే కాదు.. అమరావతి పై జగన్‌కు ప్రేమ ఉండబట్టే అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నారని మంత్రి బొత్స సమర్థించుకున్నారు.