ఉక్రెయిన్ యుద్ధం: రష్యాకు వ్యతిరేకంగా భారత జడ్జి ఓటు?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌ పై యుద్ధం అర్జంట్‌గా ఆపేయాలని ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానం రష్యాను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ తీర్పును రష్యా పెద్దగా లెక్క చేయలేదు.. అబ్బే.. ఈ యుద్ధం మీ పరిధిలోకి రాదు లెండి అంటూ వక్ర భాష్యాలు చెబుతోంది. అయితే.. ఈ తీర్పు ద్వారా ప్రపంచంలో రష్యా మరింతగా ఒంటరిగా మారుతోంది. ఈ తీర్పులో ఓ భారతీయ న్యాయమూర్తి కూడా కీలక పాత్ర పోషించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ధర్మాసనంలో ఉన్న భారత న్యాయమూర్తి రష్యాకు వ్యతిరేకంగా ఓటేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన ఐసీజే ధర్మాసనంలో భారత న్యాయమూర్తి జస్టిస్‌ దల్వీర్‌ భండారీ కూడా ఉన్నారు. ఆయన రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా ఈ తీర్పుకు కారణం అయ్యారు. అయితే.. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇండియా మొదటి నుంచి తటస్థ పాత్ర పోషిస్తోంది. రష్యా మారణ హోమాన్ని ఏ దశలోనూ ఇండియా గట్టిగా ఖండించట్లేదు. ఈ విషయంలో మన ఇబ్బందులు మనకు ఉన్నాయి.

కానీ ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లోని భారత జడ్జి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఇండియా రష్యాకు వ్యతిరేకమా అన్న ఆలోచన తలెత్తుతోంది. అయితే.. దీనిపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. అది న్యాయమూర్తిగా  భారత న్యాయమూర్తి జస్టిస్‌ దల్వీర్‌ భండారీ  వ్యక్తిగత స్థాయిలో తీసుకున్న నిర్ణయమని ప్రకటించింది. దీనిపై వ్యాఖ్యానించలేమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఈ అంతర్జాతీయ న్యాయస్థానం ధర్మాసనంలో మొత్తం 15 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ తీర్పు ఇచ్చినప్పుడు.. భారత న్యాయమూర్తి జస్టిస్‌ దల్వీర్‌ భండారీతో పాటు మరో 12 మంది రష్యాకు వ్యతిరేకంగా ఓటేశారు.. మొత్తం 15 మందిలో చైనా, రష్యా న్యాయమూర్తులు మాత్రమే ఉక్రెయిన్‌ పిటిషన్‌ను వ్యతిరేకించారు. అందువల్ల యుద్ధం ఆపేయాలంటూ ఐసీజే తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ తీర్పు అమలు కావడం మాత్రం అంత సులభం కాదు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి వెళ్లినా పెద్ద ఉపయోగం ఉండదని న్యాయ నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: