ఒక్కర్ని చేరదీసినా 450డాలర్లు ఇస్తాం..!

NAGARJUNA NAKKA
ఉక్రెయిన్ శరణార్థులను ఆదుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం హోమ్స్ ఫర్ ఉక్రెయిన్ అనే ప్రోగ్రామ్ ను ప్రకటించింది. ఒక శరణార్థికి ఆశ్రయం కల్పిస్తే.. బ్రిటన్ వాసులకు నెలకు 450డాలర్ల చొప్పున చెల్లిస్తామని వెల్లడించింది. వారికి అద్దె లేకుండా ఇల్లు ఇచ్చే వ్యక్తులకు.. స్వచ్ఛంద సంస్థలు సంబంధిత కార్యాలయాల్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఉక్రెయిన్ ప్రజలకు వీసాలు అక్కర్లేదని.. పాస్ పోర్టు ఉంటే చాలని పేర్కొంది.
ఇక ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తోన్న రష్యా బలగాలు మరో ఘాతుకానికి తెగబడ్డాయి. 26లక్షల మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్న ల్వీవ్ లోని సైనిక శిక్షణ కేంద్రంపై క్షిపణితో దాడి చేశాయి. ఈ ఘటనలో 35మంది మరణించగా.. 134 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. దీంతో అక్కడున్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
మరోవైపు ఉక్రెయిన్ లో రష్యా మారణహోమం సృష్టిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. పోలాండ్ సరిహద్దు సమీపంలోని యవోరివ్ ను రష్యా టార్గెట్ చేసిందన్నారు. మిలటరీ ట్రైనింగ్ క్యాంపుపై మిస్సైల్ దాడులు చేసిందని వివరించారు. ఈ దాడుల్లో 35మంది మృతి చెందారని చెప్పారు. అటు ఉక్రెయిన్ లోని మెలిటోపోల్ మేయర్ ను రష్యా కిడ్నాప్ చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. రెండు రోజుల్లో ఇద్దరు మేయర్లు కిడ్నాపైనట్టు పేర్కొంది.
ఉక్రెయిన్ లో ఉద్రిక్తతల కారణంగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ పూర్తిగా పోలండ్ కు తరలించింది. ఇప్పటికే రాజధాని కీవ్ లో ఉన్న కార్యాలయాన్ని మూసేసిన అధికారులు.. పోలండ్ సరిహద్దుల్లోని ల్వీవ్ నగరం నుంచి కార్యకలాపాలు కొనసాగించారు. విద్యార్థుల తరలింపు ప్రక్రియ దాదాపుగా పూర్తి కావడంతో అక్కడి కార్యాలయాన్ని కూడా మూసేసి పోలండ్ కు తరలించారు.
ఇక ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు ప్రముఖ నగరాలను రష్యా సేనలు చుట్టుముట్టాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు 15కిలోమీటర్ల దూరంలో రష్యా సైన్యం విరుచుకుపడటానికి సిద్ధంగా ఉంది. కీలక నగరాలపై ట్యాంకులు, శతఘ్నులతో దాడి చేస్తోంది. రష్యా దాడిలో పలు చిన్న నగరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. ఇప్పటి వరకు రష్యా దాడిలో 1300మంది ఉక్రెయిన్ సైనికులు, 579మంది పౌరులు మృతి చెందారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: