త్వరలో యోగి ప్రధాని అవుతారా..!

MOHAN BABU
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది. మూడున్నర దశాబ్దాల తర్వాత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. రెండోసారి వరుసగా పూర్తిస్థాయి సీఎం అయిన వ్యక్తిగా యోగి ఆదిత్యనాథ్ గుర్తింపు పొందారు. ఈ విజయం భవిష్యత్తులో ఆయనను ప్రధాని స్థాయికి తీసుకెళ్తుంది అనే చర్చ పార్టీ అగ్రనేతల మధ్య సాగుతున్నది. వెంటనే కాకపోయినా మూడేళ్ల తర్వాత అది రియాలిటి గా మారుతుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మోడీకి, యోగికి అనేక అంశాల్లో ఉన్న సారూప్యతే భవిష్యత్తులో ఈ ఊహాగానాలను నిజం చేస్తుందనే చర్చ మొదలైంది.

ప్రజలతో నేరుగా కనెక్ట్ కావడం లో, నిరాడంబర జీవితం గడపడం లో, హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ ఇద్దరి మధ్య పోలికలు అటు బీజేపీ నేతలు, ఇటు సంఘ్ నాయకులు ప్రస్తావిస్తున్నారు. సంఘ్ భావజాలంతో సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగిన ప్రయాణాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.మోడీకి, యోగికి ఇంగ్లీష్ భాష మీద పెద్దగా పట్టు లేనప్పటికీ ప్రజలకు అర్థమైన భాషలో భావాన్ని వ్యక్తీకరించడం,వారి విశ్వాసాన్ని చూరగొనడం, పాలనలో వారి మార్కును చూపడం.. ఇవన్నీ భవిష్యత్తులో స్థాయికి మోడీ తర్వాత యోగి మాత్రమే అన్ని విధాలా అర్హుడనే ఒక సాధారణ అభిప్రాయం ఉత్తరాది ప్రజల్లో, బీజేపీ కార్యకర్తల్లో, సంఘ్ నేతల్లో ఉన్నది. లిఖితపూర్వకంగా పార్టీ నిబంధనావళి లో ఎక్కడ లేనప్పటికీ 75 ఏళ్ల వయసు దాటిన వారు ప్రధాని స్థాయిలో ఉండద్దనే సిద్ధాంతం బిజెపిలో అమలవుతున్నది. ఆ నిబంధనను పార్టీ తు. చ తప్పకుండా అమలు చేయాలనుకుంటే ప్రస్తుతం 72 ఏళ్ళ వయసులో ఉన్న మోడీ 2024 ఎన్నికల తర్వాత ఒక ఏడాది మాత్రమే పదవిలో కొనసాగనున్నారు. ఆయన స్థానాన్ని యోగి ఆదిత్యనాథ్ భర్తీ చేసే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతం మోడీ కి రైట్ హ్యాండ్ అమిత్ షా అనే భావన ఉన్నప్పటికీ ప్రధాని

 అభ్యర్థి ఎంపికలో మాత్రం యోగి వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలో మోడీ తరహాలోనే యూపీ పరిపాలనలో ఏది జరగాలన్నా కేంద్రీకృతంగా యోగి కనుసన్నల్లోనే ఉండడాన్ని కూడా ఒక అంశంగా గుర్తు చేస్తున్నారు.ఒక  జాతీయ పార్టీగా క్రమంగా కాంగ్రెస్ తన గుర్తింపును కోల్పోతుండడం బీజేపీకి కలిసోస్తున్నది. ఇది మరింత బలపడాలంటే నిస్వార్థంగా, నిజాయితీగా జీవిస్తున్న యోగి లాంటి వ్యక్తి ద్వారా మాత్రమే సాధ్యమనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: