సజ్జల అసహనం ఎవరిపైన..? ఎందుకోసం..?

Deekshitha Reddy
ఏపీ రాజధానిపై హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు గందరగోళానికి తావిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంని ఆశ్రయిస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. అదే సమయంలో అమరావతిని అభివృద్ధి చేస్తారా లేదా మూడు రాజధానులకు కట్టుబడి ఉంటారా అనే విషయంలో కూడా పూర్తి క్లారిటీ లేదు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూడా ఫైనల్ ఔట్ పుట్ ఇదీ అంటూ మంత్రి బొత్స వివరించలేదు. త్వరలో మీరే చూస్తారంటూ ఆయన క్వశ్చన్ మార్క్ వదిలేశారు.
ఆతర్వాత స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రభుత్వం స్పందన చెప్పకుండా ప్రతిపక్షాన్ని తూర్పారబట్టడం మాత్రం కాస్త విచిత్రంగా తోస్తోంది. అమరావతి పేరుతో గత ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించిందని విమర్శించారు సజ్జల. అమరావతిలో టీడీపీ నేతలు ఇన్‌ సైడ్ ట్రేడింగ్ చేసుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. పోనీ ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందే అనుకుందాం.. దానిపై ప్రభుత్వం న్యాయపోరాటం చేయొచ్చు కదా. దోషుల్ని కటకటాల వెనక్కు పంపించొచ్చు కదా. పోనీ అది కుదర్లేదు. మరి అమరావతికి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది..? అభివృద్ధి ఆగిపోలేదని అంటున్నారు. మరి కనీసం అక్కడున్నవారికయినా అది కళ్లకు కనపడాలి కదా..?
రాజధాని పేరుతో లక్ష కోట్ల భారాన్ని ఏ రాష్టం కూడా మోయలేదని అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. పోనీ లక్ష కోట్లు కాకపోతే వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుందో తెలపాలి కదా. ఒక రాజధానికి లక్ష కోట్లు సరిపోదంటున్న నాయకులు.. మూడు రాజధానుల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. దీనిపైన అయినా క్లారిటీ ఉండాలి కదా. గత ప్రభుత్వం లాగా తమది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కాదు అని అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రం మొత్తం తమకు సమానమే అని చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రజల కోరిక మేరకు అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని అన్నారు సజ్జల. న్యాయవ్యవస్థను, హైకోర్టు తీర్పుని తాము గౌరవిస్తామన్నారు సజ్జల. అమరావతిలో రైతులు తక్కువగా ఉన్నారని, అదే సమయంలో.. రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారాయన.  హడావిడిగా అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు నిర్మించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు. అమరావతి రైతులకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే న్యాయం జరుగుతోందని చెప్పారు. హైకోర్టు తీర్పు తర్వాత టీడీపీ వర్గం బాణసంచా కాల్చి హంగామా చేయడం దేనికి సంకేతం అని విమర్శించారు సజ్జల. మొత్తమ్మీద హైకోర్టు తీర్పు తర్వాత మరోసారి టీడీపీ ప్రభుత్వంపై నిందలు వేసిన సజ్జల, భవిష్యత్ కార్యాచరణ గురంచి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: