రాయలసీమ : పులివెందులతోనే చంద్రబాబు మొదలుపెట్టారా ?

Vijaya



పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంతోనే చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టినట్లున్నారు. రాబోయే ఎన్నికల్లో పులివెందులలో పోటీచేయబోయే అభ్యర్ధిని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత నియోజకవర్గం ఇన్చార్జి బీటెక్ రవే రేపటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధని ప్రకటించారు. నిజానికి ఇలాంటి ప్రకటనలు చంద్రబాబు నైజానికి విరుద్ధం. నామినేషన్లు వేయటానికి రెండు రోజుల్లో గడువు ముగుస్తుందనగా అభ్యర్ధులను ప్రకటించటమంటే చంద్రబాబుకు భలే ఇష్టం.



సదరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏకి పోటీ ఉండదు. కచ్చితంగా ఆ ఎంఎల్ఏకే మళ్ళీ టికెట్ విస్తుందని అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు మాత్రం అభ్యర్ధిని ప్రకటించరు, బీఫారం ఇవ్వరు. ఆయనకు ఎంఎల్ఏలను, ఎంఎల్ఏ అభ్యర్ధులను టెన్షన్ పెట్టడమంటే అదో సరదా. దీనివల్ల టీడీపీ నష్టపోయిన సందర్భాలు చాలానే ఉన్నా ఆయన మాత్రం మారరు. అలాంటి చంద్రబాబు రాబోయే ఎన్నికలకు సంబంధించి తన వ్యూహాన్ని మార్చుకోవాల్సొచ్చింది.



షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలున్నా ఇపుడే పులివెందుల అభ్యర్ధిని ప్రకటించటం బీటెక్ రవి అదృష్టమనే చెప్పాలి. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ప్రవీణ్ కుమార్  రెడ్డే పోటీచేస్తారని చెప్పారట. ప్రవీణ్ యాక్టివ్ గా పనిచేయటం లేదని ఫిర్యాదులున్నాయి. అయినా ప్రవీణే అభ్యర్ధని చెప్పారట. మాజీ ఎంఎల్ఏ లింగారెడ్డికి ప్రవీణ్ ను గెలిపించుకొస్తే ఎంఎల్సీ హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.



అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా వీలైనంత తొందరగా నియోజకవర్గాల ఇన్చార్జిల పేరుతో అభ్యర్ధులను ఫైనల్ చేసేయబోతున్నట్లు సమాచారం. దీనివల్ల అభ్యర్ధులకు, పార్టీకి మైనస్సుంది, ప్లస్సూ ఉంది.  నేతల్లో బీపీని పెంచేసి చివరి నిముషంలో అభ్యర్ధిని ప్రకటించటం ఒక సమస్య. అలాగే రెండున్నరేళ్ళకు ముందే అభ్యర్ధులను ప్రకటించటం మరో సమస్య. ఏదేమైనా చంద్రబాబు చేయబోతున్న కొత్త ప్రయోగం పార్టీకి ఏ విధంగా లాభం చేకూరుస్తుందో చూడాల్సిందే.



మధ్యలో ఉంటుందో ఉండదో తెలీని జనసేన పొత్తు అయోమయం ఒకటుంది కదా. అందుకనే చంద్రబాబు నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం విషయంలో ఆచుతూచి వ్యవహరిస్తున్నారు. కచ్చితంగా టీడీపీనే పోటీచేస్తుందనే చోట్ల మాత్రమే అభ్యర్ధులను ప్రకటించబోతున్నారట. చూద్దాం చివరకు ఏమవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: