బిగ్‌ డే: బిల్‌ గేట్స్‌తో కేటీఆర్‌ చర్చలు..?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ అభివృద్ధి ప్రస్థానంలో ఇవాళ మరో కీలకమైన రోజు కాబోతోంది. ఇవాళ, రేపు హైదరాబాద్‌ వేదికగా బయో ఆసియా సదస్సు జరగబోతోంది. ఈ బయో ఆసియా సదస్సును తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఈ సదస్సు హైదరాబాద్‌లో రెండ్రోజులపాటు వర్చువల్ విధానంలో జరగబోతోంది. లైఫ్ సైన్సెస్, ఆరోగ్య రంగంలో కొవిడ్‌ సవాళ్లపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. కొవిడ్ సృష్టించిన అవకాశాలు, భవిష్యత్తు కార్యచరణపై చర్చించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం.

అయితే.. ఈ సదస్సు మొదటి రోజు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హాజరుకానున్నారు. తొలి రోజు కేటీఆర్‌-బిల్‌గేట్స్ మధ్య జరగనున్న చర్చలు కీలకం కాబోతున్నాయి. ఈ సదస్సుకే ఈ చర్చలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సదస్సులో 70 కి పైగా దేశ విదేశాల సంస్థలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త సౌమ్య స్వామి నాథన్ కూడా ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు.

హైదరాబాద్ ప్రధానంగా బయోటెక్నాలజీ రంగంలో, ఫార్మా రంగంలో దూసుకుపోతున్న దృష్ట్యా ఇలాంటి అంతర్జాతీయ సదస్సు జరగడం నగరాభివృద్దికి దోహదం చేస్తుంది. అంతర్జాతీయ సదస్సుల ద్వారా హైదరాబాద్‌ పై ఫోకస్‌ వస్తుంది. ఇక్కడ అందుబాటులో ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందించే సౌకర్యాల గురించి అంతర్జాతీయ సంస్థల మధ్య చర్చ జరిగే అవకాశం దొరుకుతుంది. విదేశీ పెట్టుబడులు వచ్చేందుకు.. విదేశాల్లో పరపతి పెరిగేందుకు అది దోహదం చేస్తుంది.

ఈ సదస్సు రెండో రోజు ఫార్మా రంగం వృద్ధి, అవకాశాలపై చర్చ జరగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరం ఫార్మా రంగంలో మంచి అభివృద్ధి కనబరుస్తోంది. డాక్టర్ రెడ్డీ, హెటిరో, అరబిందో వంటి సంస్థలు అంతర్జాతీయంగా ఔషధాలు ఎగుమతి చేస్తున్నాయి. ఇక బయెటెక్నాలజీ రంగంలోనూ విస్తృత ప్రగతి కనిపిస్తోంది. జీనోమ్ వ్యాలీ నుంచి కరోనా టీకాలు కూడా ఉత్పత్తి చేయడం ద్వారా హైదరాబాద్ ఖ్యాతి ఇప్పటికే ఇనుమడించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: