ఎంపీ అవినాష్‌ మెడకు వివేకా హత్య కేసు ఉచ్చు..?

Chakravarthi Kalyan
సరిగ్గా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన మాజీ మంత్రి, వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు ఇది వైసీపీ ఎంపీ.. వరుసగా జగన్ సోదరుడైన అవినాష్‌ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు సీబీఐ కూడా వివేకాను అవినాష్‌ రెడ్డే హత్య చేయించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెబుతోంది. కడప ఎంపీ టికెట్‌ను వివేకా ఆశించినందుకే అవినాష్‌ రెడ్డి కక్ష కట్టారని సీబీఐ చార్జ్‌ షీట్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

వైఎస్‌ వివేకానందరెడ్డిని.. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి.. హత్య చేయించారని అనుమానం ఉందని సీబీఐ తన పత్రాల్లో చెబుతోంది. ప్రస్తుతం  ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్టు సీబీఐ తన అభియోగ పత్రాల్లో పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. కడప లోక్‌సభ నియోజకవర్గం టికెట్టు కోసం సాగిన రాజకీయమే ఇందుకు కారణమని సీబీఐ భావిస్తోంది. కడప సిట్టింగ్ ఎంపీ అవినాష్‌ రెడ్డి.. అయితే.. ఈ టికెట్‌ను ఈసారి అవినాష్‌ రెడ్డికి కాకుండా.. తనకు కానీ..  వైఎస్‌ షర్మిల, విజయమ్మల్లో ఎవరికైనా ఇవ్వాలని వైఎస్‌ వివేకానందరెడ్డి అడిగారట.

తనకు రాజకీయంగా అడ్డు వస్తున్నారన్న కోపంతోనే అవినాష్‌రెడ్డి వివేకాను హత్య చేయించి ఉంటారనే సీబీఐ భావిస్తోందట. ఇప్పటి వరకూ సాగిన తమ దర్యాప్తులో ఇవే  విషయాలు వెలుగులోకి వచ్చాయని సీబీఐ తన అభియోగ పత్రాల్లో చెబుతోంది. ఇంకా వివేకా హత్య వెనుక ఉన్న కుట్రను వెలికితీయాల్సి ఉందని సీబీఐ తెలిపింది.

ఈ హత్యలో ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి  శివశంకర్‌రెడ్డి, యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి కీలక పాత్ర పోషించారని సీబీఐ తన అభియోగపత్రాల్లో పేర్కొంది. పులివెందుల కోర్టులో సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. వివేకాను హత్య చేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారని.. అందులో నీకు రూ.5 కోట్లు ఇస్తామని... ఈ హత్య వెనుక వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి వంటి పెద్దలు ఉన్నారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్టు దస్తగిరి సీబీఐకి చెప్పినట్టు సీబీఐ అభియోగ పత్రాల్లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: