చలో మేడారం.. అన్ని సౌకర్యాలు కల్పించారా..!

MOHAN BABU
మేడారం అభివృద్ధి పనుల్లో డొల్లతనం బయటపడుతుంది. పనులు నాసిరకంగానే కొనసాగుతున్నాయి.పనుల కోసం 75 కోట్లు విడుదలవ్వగా.. నాణ్యత మాత్రం కనిపించడం లేదు. పనులు త్వరగా పూర్తి కావాలని మంత్రులు ఆదేశిస్తుండటంతో ఇదే చాన్స్ గా భావించిన కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యత పాటించటం లేదు.జంపన్నవాగు వద్ద నిర్మిస్తున్న స్నానఘట్టాలు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణంలో క్వాలిటీ ఉండడంలేదు. ఓ వైపు కడుతుండగానే మరోవైపు కూలి పోతుండడం గమనార్హం. మేడారం జాతర ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది.కానీ భక్తులు మాత్రం రెండు మూడు రోజుల ముందు నుంచే అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పై ఉంది.పనులు కొనసాగుతున్నా వాటి నాణ్యత విషయంలో డొల్లతనం బయటపడుతుంది.

కానీ ఈ విషయంలో అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.పనులు సైతం అనుకున్న సమయంలో పూర్తయ్యే అవకాశాలు లేవని అధికారులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.జాతరలో భాగంగా అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 75 కోట్లు కేటాయించింది. ఆర్ అండ్ బి, ఆర్ డబ్ల్యూ ఎస్, ఇరిగేషన్, గిరిజన సంక్షేమం, ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రధాన పనులు కొనసాగుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ఆర్డబ్ల్యూఎస్ శాఖకు మంజూరు చేసింది. ఇందులో చాలా నిర్మాణాలు బేస్మెంట్ దశలోనే ఉన్నాయి. నిర్మించిన కొద్ది రోజులకే కూలిపోతున్నాయి. కొన్ని నిర్మాణాలైతే గట్టిగా తోస్తేనే కూలిపోతున్నాయంటే పనుల్లో నాణ్యత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణంలో ఐఎస్ఐ బ్రాండ్ జీఏ షీట్స్ కు బదులుగా నాసిరకమైనవి వినియోగిస్తున్నారు.

గతంలో నిర్మించిన మరుగుదొడ్ల మరమ్మత్తులు ఇంకా ప్రారంభం కాకపోవడం గమనార్హం. వాస్తవానికి పనులు డిసెంబర్ చివరి లోగా పూర్తి కావాలి. కానీ వాయిదా పడుతూ వస్తున్నాయి.మేడారం గ్రామానికే అనుసంధానమైన రోడ్ల మరమ్మతులు, నిర్మాణం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్నాన ఘట్టాల నిర్మాణాలు, చెక్ డ్యాములు  ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. లైటింగ్, పార్కింగ్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల బిగింపు,తాగునీటి కేంద్రాల ఏర్పాటు వంటి పనులు సైతం కొనసాగుతూనే ఉన్నాయి. జాతర ప్రారంభం అయ్యే లోపు పూర్తవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: