ఉత్తరాంధ్ర : ఉత్తరాంధ్రపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారా ?

Vijaya



రాబోయే ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కువగా ఉత్తరాంధ్ర మీదే ఎక్కువగా దృష్టి పెట్టినట్లున్నారు. ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలున్నాయి. అలాగే 5 లోక్ సభ సీట్లున్నాయి. వీటిల్లో విశాఖపట్నం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 9, శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలున్నాయి. ఈరోజు కాకపోయినా రేపైనా విశాఖపట్నం రాజధానిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయటం ఖాయం. పైగా వైజాగ్ లోని గాజువాకలో మొన్నటి ఎన్నికల్లో పవన్ పోటీచేసి ఓడిపోయారు.



అందుకనే రాబోయే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్న ఏకైక లక్ష్యంతో ఉత్తరాంధ్రపై పవన్ గట్టిగా దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు తానొక్కడినే పోరాటం చేసినట్లు, చేస్తున్నాననే భావనలో పవన్ ఉన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో  ఎలాగైనా జనసేన మంచి ఫలితాలు సాధిస్తుందని పార్టీ సీనియర్ నేతలు కూడా సర్వేలాంటిది చేసి పవన్ కు చెప్పారట. ఉత్తరాంధ్రలోనే పవన్ కు మంచి ఆధరణ ఉందని కూడా తేలిందట.



అందుకనే ఉత్తరాంధ్ర జర్యటన కోసం ముగ్గురు నేతలు అర్హాన్ ఖాన్, పంతం నానాజీ, ముత్తా శశిధర్ తో కమిటి నియమించారు. ఈ కమిటి తొందరలోనే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో పర్యటించబోతోంది. గ్రామస్ధాయి నుండి నియోజకవర్గం, జిల్లా కేంద్ర కమిటిల సభ్యులతో సమావేశాలు నిర్వహించబోతోంది. క్షేత్రస్ధాయిలో ప్రభుత్వంపై జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, జనసేన విషయంలో జనాభిప్రాయం ఏమిటనే విషయాలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందట.



వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గాజువాక నుండే పోటీ చేస్తానని ఒకసారి చెబుతారు. కాపులు ఎక్కువగా ఉండే కాకినడ రూరల్ నియోజకవర్గంపైన పవన్ దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇదేమీ కాదని భీమిలీ నుండే పోటీచేస్తారని కొందరు, అలాకాదు వైజాగ్ సిటిలోని నాలుగు నియోజకవర్గాల్లో ఒకదాని నుండి పోటీచేస్తారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా పవన్ పోటీచేయబోయే నియోజకవర్గాలపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. పవన్ ఎక్కడినుండి పోటీచేస్తారనే విషయంలో క్లారిటి లేకపోయినా ఉత్తరాంధ్రపైన ఎక్కువ ఆశలే పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: