కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఆంక్షలు కఠినతరం..!

NAGARJUNA NAKKA
మన దేశంలో కరోనా ఆంక్షలు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా టెస్టులు పెంచాలని సూచించింది. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని లేఖలో పేర్కొంది. వైరస్ వ్యాప్తికి దోహదపడే ర్యాలీలు, సభలు, సమావేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక మన దేశంలో దశల వారీగా స్కూల్స్ తెరిచి.. కోవిడ్ 19 మార్గదర్శకాలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు నిర్వహించేలా చూసేందుకు కేంద్రం ఓ నమూనాను తయారు చేస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. స్కూల్స్ తెరవాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినతులు వస్తుండటంతో కేంద్రం ఈ దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్టు వెల్లడించాయి. అయితే దేశంలో కేసులు మళ్లీ భారీగా పెరగడంతో చాలా రాష్ట్రాల్లో ప్రత్యక్ష తరగతులు నిలిచిపోయాయి.
ఇక కరోనా  ఆంక్షల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ, సండే లాక్ డౌన్ ను ఫిబ్రవరి 1నుంచి ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. అదే రోజు నుంచి స్కూళ్లు, కాలేజీలను తెరవనుంది. వివాహ వేడుకలకు 100మంది, అంత్యక్రియలకు 50మందికి మించరాదని నిబంధన విధించింది. రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, జిమ్ లు, యోగా సెంటర్లు 50ఆక్యుపెన్సీతో నిర్వహించుకోవాలని సూచించింది.
ఇక దేశరాజధాని ఢిల్లీ కూడా వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అదుపులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే కేసులు భారీగా పెరగడంతో గత నెల నుంచి ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ అమలు చేశారు.
ఇక అదే బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నైట్ కర్ఫ్యూ విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రోజూ దాదాపు 4వేల కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు 10దాటితే కర్ఫ్యూ విధించే అవకాశముందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు నిన్న ప్రెస్ మీట్ లో అన్నారు. అయితే మేడారం జాతర వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండటంతో జాతర తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించే అవకాశముందని సమాచారం.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: