వ్యాక్సినేషన్ విషయంలో ఏపీకి అరుదైన ఘనత..!

NAGARJUNA NAKKA
దేశంలో టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 15 నుండి 18ఏళ్ల మధ్య వారిలో ఇప్పటి వరకు 52శాతం మంది తొలి డోసు తీసుకున్నారని కేంద్రం తెలిపింది. టీనేజర్లకు టీకా పంపిణీలో ఏపీ టాప్ లో ఉందనీ.. 91శాతం మంది టీనేజర్లకు ఏపీలో వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొంది. ఆ తర్వాత 83శాతం మందికి వ్యాక్సిన్ తో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో, 71శాతంతో మధ్యప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. 55శాతం మందికి టీకా ఇవ్వడంతో తెలంగాణ 19వ స్థానంలో నిలిచింది.
మరోవైపు త్వరలోనే 15ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా కార్యక్రమం చేపడతామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. ఈ ప్రక్రియ గురించి సైంటిఫిక్ డేటా రాగానే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం 15 నుండి 18ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇస్తున్నట్టు చెప్పారు. అటు థర్డ్ వేవ్ లో మృతుల సంఖ్య తక్కువగా ఉన్నా నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. కొన్ని రాష్ట్రల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని తెలిపారు.
ఇక ఏపీలో గత 24గంటల్లో కొత్తగా 12వేల 615 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసులతో పోలిస్తే భారీగా పెరిగాయి. మరోవైపు కోవిడ్ వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 3వేల 674 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 53వేల 871 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదిలా ఉంటే ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా స్కూళ్లు మూసివేయాలన్న డిమాండ్ పై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. కరోనా కేసులు పెరుగుతున్నా.. తీవ్రత అంతగా లేదు. స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు. పిల్లలకు కరోనా సేకితో ఆ స్కూలు మూసివేసి తర్వాత ప్రారంభిస్తామన్నారు. కొన్ని యూనివర్సిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.

ఇక కరోనా విజృంభిస్తోన్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ టెస్ట్ ధరను తగ్గించింది. ఐసీఎమ్ఆర్ గుర్తింపు కలిగిన ఎన్ఏబీఎల్ ప్రైవేట్ ల్యాబ్ లలో ఆర్టీపీసీఆర్ ధరను 350రూపాయలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వం పంపే ఆర్టీపీసీఆర్ శాంపిళ్లను పరీక్షించేందుకు ఎన్ఏబీఎల్ ల్యాబ్ లలో 499రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వాటిని 350రూపాయలకు తగ్గించిన ప్రభుత్వం.. ఆస్పత్రులు, ల్యాబ్ లలో తప్పనిసరిగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ఆదేశించింది.
 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: