గోవా తీరం దీదీ సొంతం అవుతుందా....!

Podili Ravindranath
దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరూ అంటే... ముక్కకంఠంతో చెప్పే పేరు ఒకటే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ. దేశ తూర్పు తీరంలో ఇప్పటికే పాగా వేసిన దీదీ... పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి వ్యవహరిస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‍‌పై ఒంటికాలుతో పోరు చేస్తున్న దీదీ... బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. కమలం పార్టీ పెద్దలంతా కలిసి బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేశారు. సరిగ్గా ఎన్నికల రోజున.. ఓ వర్గం ఓట్లను టార్గెట్ చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో కూడా పర్యటించారు. అక్కడి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు. కానీ... దీదీ హవాకు ఏ మాత్రం బ్రేకులు వేయలేక పోయారు. అధికారంలోకి వస్తామంటూ గొప్పలు చెప్పిన కమలం పార్టీ నేతలు... చివరికి కేవలం రెండకెల స్థానాలకే పరిమితం అయ్యారు. ఎన్నికల ముందు టీఎంసీని వీడిన నేతలంతా కూడా... ఫలితాల తర్వాత... అదే స్పీడుతో దీదీకి జై కొట్టారు.
అదే ఊపుతో దీదీ ఇప్పుడు దేశ పశ్చిమ తీరంపై కూడా కన్నేశారు. బెంగాల్‌తో వ్యాపార సారూప్యం ఉన్న గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై మమతా బెనర్జీ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రధానంగా జాతీయ స్థాయిలో బీజేపీని దెబ్బ కొట్టాలంటే... ఆ పార్టీకి పట్టు ఉన్న రాష్ట్రాల్లో అధికారం చేజిక్కుకోవాలనేది కూడా దీదీ ప్లాన్. దీంతో... గత అసెంబ్లీ ఎన్నికల్లో బోటాబోటి సీట్లు సాధించి... పొత్తుల సాయంతోనే గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందుకే దీదీ కూడా అదే పొత్తులపై ప్రధానంగా దృష్టి సారించారు. బీజేపీ అలయన్స్ పార్టీ మహారాష్ట్ర వాదీ పార్టీతో దీదీ పొత్తు పెట్టుకున్నారు. నెల రోజుల వ్యవధిలో ఏకంగా ఐదు సార్లు మమతా గోవాలో పర్యటించారు. అసంతృప్తి నేతలను తమ వైపు లాగేసుకున్నారు. ఇటు భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే మారింది. ప్రజల్లో మంచి పేరున్న మనోహర్ పారికర్ వంటి నేత లేకుండా గోవాలో తొలిసారి బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. సరైన నేత లేక పోవడం కూడా ప్రస్తుతం కమలం పార్టీకి కాస్త ఇబ్బందికరమే. ప్రస్తుతం గోవాలో టీఎంసీ గట్టి పోటీ ఇస్తుందని అంతా భావిస్తున్నప్పటికీ... అధికారం సొంతం అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: