బండి సంజయ్‌.. భలే వాడేసుకుంటున్నాడుగా..?

Chakravarthi Kalyan
అవకాశాలను అందిపుచ్చుకునేవాడే అసలైన రాజకీయ నాయకుడు.. మొన్న ఉద్యోగుల కోసం ఆయన జాగరణ దీక్ష చేద్దామనుకున్నాడు.. ఆ దీక్షతో కాస్త ఉద్యోగుల మద్దతు కూడగట్టుకోవాలనుకున్నాడు.. ఆ దీక్ష సజావుగా సాగి ఉంటే.. కాస్త మైలేజే వచ్చి ఉండేది.. కానీ.. అనూహ్యంగా ఆ దీక్షకు సర్కారు భగ్నం చేయించి.. ఆయన్ను అరెస్టు చేయించడంతో సీన్ మారిపోయింది. ఈ అవకాశాన్ని బండి  సంజయ్‌ బాగానే వాడుకుంటున్నారు. కోర్టు నుంచి బెయిల్ పొంది దానిపై బయటకు వచ్చిన బండి సంజయ్‌ ఇప్పుడు మరింత జోరు పెంచుతున్నారు.

మొన్న బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ వచ్చి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో మంచి పబ్లిసిటీ వచ్చింది. అఫ్‌ కోర్స్‌ ఆయన వచ్చింది ఆర్ఎస్‌ఎస్ సమావేశాలకే కావచ్చు.. కానీ దాన్ని బండి సంజయ్‌ బాగా వాడేసుకున్నారని చెప్పాలి. అలాగే మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా ఇప్పుడు తెలంగాణ వచ్చారు. బండి సంజయ్‌కు మద్దతుగా సభలు నిర్వహిస్తున్నారు.

అంతేనా.. ఇప్పుడు మరో సీఎం కూడా రాబోతున్నారు. ఇవాళ హనుమకొండ జిల్లాకు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ రాబోతున్నారు. బండి సంజయ్‌తో కలిసి హనుమకొండలో హిమంత బిశ్వశర్మ పర్యటించబోతున్నారు. బీజేపీ సమావేశానికి బండి సంజయ్‌, హిమంత బిశ్వశర్మ, లక్ష్మణ్‌ హాజరుకాబోతున్నారు. ఇలా ఒక్క ఘటనలో మొత్తం బీజేపీ నేతలను తనవైపునకు తిప్పుకుని.. తనకు మద్దతుగా వచ్చేలా చేసుకోవడంలో బండి సంజయ్‌ సక్సస్ అయ్యారు. రాష్ట్రస్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఫోకస్‌ పొందగలిగారు బండి సంజయ్.

ఇదంతా ఒక ఎత్తు తాజాగా బండి సంజయ్‌కు ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేయడం మరో ఎత్తు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రధాని ఫోన్ చేసి పరామర్శించారట. తెలంగాణలో రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారట. సంజయ్ జాగరణ దీక్ష, అరెస్టు పరిణామాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారట. పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారట. మొత్తానికి ఒక్క దీక్షను బండి సంజయ్‌ భలే వాడేసుకున్నారుగా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: