తెలంగాణా : కేసీయార్ ఆపని చేస్తే ఇమేజి పెరగటం ఖాయం

Vijaya


వనమా రాఘవేంద్ర.. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా పరిచయం అవసరం లేని పేరిది. ఎందుకంటే ఒక కుటుంబం ఆత్మహత్యకు కారకుడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి. కొత్తగూడెంలో నాగ రామకృష్ణ తన కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవటానికి ఈ వనమా రాఘవే కారణమని యావత్ తెలంగాణా సమాజం అట్టుడుకిపోతోంది. మొదట్లో ఈ ఘటనను ఎవరు పట్టించుకోకపోయినా సోషల్ మీడియా పుణ్యమాని ఇపుడు గోల గోల అవుతోంది.



ఒత్తిడికి లొంగిపోయిన పోలీసులు రాఘవను అరెస్టు చేశామని ఒకసారి అదుపులోకి తీసుకున్నట్లు మరోసారి, లేదు లేదు లొంగిపోయాడని ఇంకోసారి జనాల్లో అయోమయం క్రియేట్ చేస్తున్నారు. సరే రాఘవకు కేసులు కొత్తకాదు, లొంగిపోవడాలు, అరెస్టులూ కొత్తకాదు. ఎందుకంటే అతనిపై ఉన్న కేసులకు లెక్కేలేదు కాబట్టి. తన కన్ను పడనంతవరకే ఆస్తయినా ఆడదైనా. పడిందంటే సొంతమైనా అవ్వాలి లేదా ఇలా బతుకన్నా అర్ధాంతరంగా చాలించాల్సిందే.



సరే అసలు రాఘవకు ఇంతటి బలం ఎలాగొచ్చింది ? రాజ్యాంగేతర శక్తిగా ఎలా ఎదిగాడు ? ఎలాగంటే కేవలం తండ్రిని చూసుకునే అనిచెప్పాలి. తండ్రి వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం టీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉన్నారు. ఇంతకముందు కాంగ్రెస్ ఎంఎల్ఏగా మంత్రిగా కూడా పనిచేశారు. దశాబ్దాలుగా తండ్రి ఎంఎల్ఏగా, మంత్రిగా పనిచేయటంతో కొడుకు రాఘవ షాడో ఎంఎల్ఏగా మంత్రిగా బాగా ఎదిగిపోయాడు. అందుకనే ఇన్ని అరాచకాలకు పాల్పడుతున్నా ఎవరు అడ్డకోలేకపోతున్నారు.



ఇప్పుడు రాఘవను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. నిజానికి పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సింది రాఘవను కాదు. వనమాతో ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయించాలి. ఎందుకంటే తండ్రి ఎంఎల్ఏగా ఉండబట్టే కదా ఈ కాలకేయుడిగా ప్రచారంలో ఉన్న రాఘవ బరి తెగిస్తున్నది. మూలాన్ని వదిలేసి పైపైన మందు వేస్తే రోగం తగ్గదు. మూలాన్ని తెగ్గొడితేనే వ్యాధి నయమయ్యేది. వనామాతో రాజీనామా చేయిస్తేనే కేసీయార్ ప్రభుత్వం ఇమేజి నిలుస్తుంది.



లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఇలాంటి కాలకేయులను ప్రతిపక్షాలు హైలైట్ చేస్తే సమాధానం చెప్పటానికి అధికారపార్టీకి ఏముండదు. విచిత్రం ఏమిటంటే తన కొడుకు నిర్దోషని తేలేంతవరకు నియోజకవర్గానికి, రాజకీయాలకు దూరంగా ఉంచుతానని వనమా హామీ ఇవ్వటం. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా తన కొడుకు అమాయకుడని వనమా చెబుతుండటమే విచిత్రం. వనమాతొ రాజీనామా చేయించి, కొడుకు అరాచకాల మీద విచారణ జరిపించి యాక్షన్ తీసుకుంటే మరో కాలకేయుడు లేవటానికి కనీసం కొంత సమయమన్నా పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: