కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిన జగ్గన్న.. వ్యూహం ఇదేనా..!

MOHAN BABU
తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి దుమారం కొనసాగుతోంది. టిపిసిసి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని తప్పు పడుతూ, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి జగ్గారెడ్డి రాసిన లేఖ మీడియాకు లీక్ అవ్వడంపై పార్టీలో అంతర్గతంగా రచ్చ అవుతుంది. అయితే ఇది క్రమశిక్షణ ఉల్లంఘన అని, జగ్గారెడ్డిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తారని వార్తలు ఓవైపు, అసలు రేవంత్ నే క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవాలన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలు మరోవైపు పార్టీలో మంటలు రేపుతున్నాయి. రైతులతో రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ లో చిచ్చు మొదలైంది. కిసాన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రబెల్లికి వెళ్తానని రేవంత్ ప్రకటించారు.

జిల్లాకు చెందిన నేతలకు కనీస సమాచారం ఇవ్వకుండా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తనకు తెలియకుండా పీసీసీ చీఫ్ ఎర్రవెల్లికి ఎలా వెళతారని జగ్గారెడ్డి బాహాటంగానే నిలదీశారు. తర్వాత రేవంత్ వ్యవహార శైలి మార్చాలని, లేకుంటే పీసీసీ చీఫ్ నే మార్చాలని కోరుతూ పార్టీ అధినేత్రి సోనియాకు, జగ్గారెడ్డి లేఖ రాశారు. దీన్ని రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగ్గారెడ్డిని పిలిచి వివరణ కోరతామని చిన్నారెడ్డి చెప్పారు. వివిధ అంశాలపై జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రావుతో మాట్లాడతామన్నారు. పార్టీలో కొన్నిచోట్ల గ్రూపు రాజకీయాలు నడుస్తున్నట్లు తమ దృష్టికి వచ్చాయని, ఆయా ప్రాంతాల్లో కమిటీ పర్యటించి సమస్యలను పరిష్కరిస్తుందని వెల్లడించారు.  చిన్నారెడ్డి నా గురించి మాట్లాడినందునే నేను కూడా మీడియాకు ప్రకటన ఇస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు. నేను సోనియాకు రాసిన లేఖ మీడియాకు లీక్ అవుతూనే క్రమశిక్షణా ఉల్లంఘన అయితే, హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార సమయంలో పార్టీ నియమాలను ఉల్లంఘించి మరీ పెద్దపల్లి అభ్యర్థిని ప్రకటించిన పిసిసి అధ్యక్షుడు క్రమశిక్షణ పరిధిలోకి రారా.

నా సొంత ఉమ్మడి జిల్లాలోనే ఏకైక ఎమ్మెల్యే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నాకు చెప్పకుండా పార్టీ కార్యక్రమాన్ని ప్రకటిస్తే క్రమశిక్షణా కిందకు రాదా, వరంగల్ లోక్ సభ ఇన్చార్జి నైనా నాకు తెలియకుండా, భూపాలపల్లిలో రచ్చబండకు వెళుతున్నట్లు ప్రకటించడం ఏంటి. అసలు క్రమశిక్షణ పాటించని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి  క్రమశిక్షణ గురించి చెప్పాలి. మొదట రేవంత్ రెడ్డిని పిలిచి మాట్లాడాలి అని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఆ తర్వాత తాను కమిటీ ముందు హాజరవుతానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: