నాలుగో డోస్ కు ఆమోదం.. ఎక్కడో తెలుసా..?

NAGARJUNA NAKKA
కోవిడ్ 19 వ్యాక్సిన్ నాలుగవ డోస్ కు ఆమోదం తెలిపిన తొలిదేశంగా ఇజ్రాయేల్ అవతరించింది. రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉన్న వారికి ఈ డోసులు అందించనున్నట్టు ఆ దేశ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ దేశంలో 4.2 మిలియన్ మంది మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు వివరీతంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గత 24గంటల్లో ఒక్క అమెరికాలోనే 6లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో ఇదే ప్రపంచ రికార్డు అని.. ఇప్పటి వరకు ఒక్క రోజులో ఇన్ని కేసులు ఎప్పుడూ రాలేదని అక్కడి అధికారులు తెలిపారు. కరోనా కాటుకు 1300మంది మరణించారు. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఫ్రాన్స్ లో 2.06లక్షలు, యూకేలో 1.90లక్షల కేసులు వచ్చాయి.
మన దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ ఉదయ్ పూర్ కు చెందిన 73ఏళ్ల వ్యక్తి మరణించినట్టు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన అతడు కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పేర్కొన్నారు. అతడికి హైపర్ టెన్షన్ తో పాటు డయాబెటిస్ కూడా ఉందన్నారు. నెగెటివ్ వచ్చాక పోస్ట్ కోవిడ్ న్యూమోనియా ఎఫెక్ట్ ద్వారా మరణించి ఉంటారన్నారు. అయితే మహారాష్ట్రలోనూ ఒమిక్రాన్ మరణం నమోదైనట్టు తెలుస్తోంది.
ఇక మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12వందల 70మందికి ఒమిక్రాన్ సోకిందని కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 450, ఢిల్లీలో 320కేసులొచ్చాయి. తెలంగాణలో 62, ఏపీలో 16మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఇక దేశవ్యాప్తంగా 374మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 23రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది.
రాష్ట్రాల వారీగా ఒమిక్రాన్ కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్రలో 450, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్ లో 97, రాజస్థాన్ లో 69, తెలంగాణలో 62, తమిళనాడులో 46, కర్ణాటకలో 34, ఆంధ్రప్రదేశ్ లో 16, హర్యానాలో 14, ఒడిశాలో 14, వెస్ట్ బెంగాల్ లో 11, మధ్యప్రదేశ్ లో 9, ఉత్తరాఖండ్ లో 4, ఛండీఘర్ లో 3, జమ్ముకశ్మీర్ లో 3, ఉత్తరప్రదేశ్ లో 2, గోవాలో 1, హిమాచల్ ప్రదేశ్ లో 1, మణిపూర్ లో 1, పంజాబ్ లో ఒక్క కేసు నమోదైంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: