ఢిల్లీ : రామ..రామ..రఘురామకు మిగిలిందొకటే ఛాన్సా ?

Vijaya



వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రింకోర్టు మెట్లెక్కడం ఒకటే మిగిలింది. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయించి తిరిగి జైలుకు పంపాలనే పట్టుదలతో ఎంపీ చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. తాజాగా హైకోర్టులో జరిగిన విచారణలో న్యాయమూర్తి ఎంపీకే అక్షింతలు వేశారు. విచారణలో భాగంగా న్యాయమూర్తి మాట్లాడుతు వ్యక్తిగత రాజకీయాలకు కోర్టును వేదికగా మార్చుకోవద్దంటు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.



అలాగే బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ వేసినపుడు అందుకు తగ్గ ఆధారాలను ఎందుకు సమర్పించలేదంటు నిలదీశారు. న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలతో విషయం అర్ధమైపోయింది. ఇదే సందర్భంగా సాక్ష్యులను బెదిరిస్తున్నట్లు కానీ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు జగన్ కు వ్యతిరేకంగా ఎవరు తమకు ఫిర్యాదులు చేయలేదని సీబీఐ స్పష్టంగా చెప్పింది.  రఘురామ ధోరణి ఎలాగుందంటే తాను పిటీషన్ మాత్రమే వేస్తానని ఆధారాలన్నీ కోర్టు సేకరించుకోవాలన్నట్లుంది.



ఇదే విధమైన పిటీషన్ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. అందుకనే ఎంపీ మళ్ళీ హైకోర్టులో అప్పీలు చేశారు. సీబీఐ కోర్టు పిటీషన్ను కొట్టేసినపుడే ఎంపీ మాట్లాడుతు హైకోర్టులో కేసు వేస్తానని, అక్కడ కూడా కేసు కొట్టేస్తే సుప్రింకోర్టులో కేసు వేస్తానని ప్రకటించారు. అంటే జగన్ పైన గుడ్డివ్యవతిరేకతతో మాత్రమే ఎంపీ కేసులు వేస్తున్నట్లు అర్ధమవుతోంది. జగన్ బెయిల్ రద్దు చేయించాలంటే అందుకు తగ్గ ఆధారాలను కూడా సమర్పించాలన్న విషయాన్ని ఎంపీ మరచిపోయారు.


సాక్ష్యులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలతో ఆధారాలు లేకుండా కేసులు వేస్తే నిలవదనే కనీసపు ఆలోచన కూడా ఎంపీలో లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఎంపీ ముందే చెప్పినట్లుగా సీబీఐ కోర్టులో కేసు కొట్టేస్తే హైకోర్టులో పిటీషన్ వేశారు. హైకోర్టులో కూడా పిటీషన్ కొట్టేస్తే తర్వాత సుప్రింకోర్టు ఒకటే ఎంపీకి మిగిలింది. అక్కడ కూడా కేసు కొట్టేస్తే చివరకు అంతర్జాతీయ న్యాయస్ధానంలో కేసు వేస్తారేమో చూడాలి. మొత్తానికి రఘురామ కేసుల వల్ల జగన్ కు నష్టమేమీ లేదుకానీ లాయర్లకు మాత్రం చేతినిండా డబ్బు. ఎందుకంటే ప్రతికోర్టులోను వాదించినందుకు ఎంపీ పెద్దమొత్తంలోనే ఫీజులు చెల్లించుకోక తప్పదు కదా.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: