వాళ్ల నిర్లక్ష్యమే వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం..!

NAGARJUNA NAKKA
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల పర్యవేక్షణలో వైద్యాధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకగా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అతడు ఆస్పత్రి నుంచి తప్పించుకొని రెండు రోజులు హైదరాబాద్ లో తిరిగాడు. ఈ నెల 14న మరో వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా 15న మధ్యాహ్నం వరకు అతడిని గుర్తించలేకపోయారు. ఈ సమయంలో వాళ్లు ఎంతమందికి ఒమిక్రాన్ వ్యాప్తి చేసి ఉంటారో ఊహించుకోవచ్చు.
తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తాజాగా యూకే నుంచి హనుమకొండకు వచ్చిన ఒక మహిళకు ఒమిక్రాన్ సోకినట్టు తేలిందన్నారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరిందని పేర్కొన్నారు. కెన్యా నుంచి 3, అబుదాబి నుంచి 1, యూకే నుంచి 1, దుబాయ్ నుంచి 2, చెక్ రిపబ్లిక్ నుంచి 1 కేసులు వచ్చినట్టు చెప్పారు. ఒమిక్రాన్ వచ్చిన వారిలో తీవ్రమైన లక్షణాలు లేవని వివరించారు.
ఒమిక్రాన్ సోకడానికి వ్యాక్సిన్ తీసుకోకపోవడం కూడా ఒక కారణమని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. యూకేలో టీకా తీసుకోని వారిలో మాత్రమే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, దగ్గు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలన్నారు. కొద్ది వారాల పాటు ఇంట్లో కూడా మాస్కు ధరించాలని.. గాలి, వెలుతురు వచ్చేలా తలుపులు కిటికీలు తెరుచుకోవాలని సూచించారు.
ఇక బ్రిటన్ లో సైతం రికార్డు స్థాయిలో కరోనా, ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రజల రాకపోకలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. అయితే క్రైస్తవులకు అతిపెద్ద పండగైన క్రిస్మస్ సందర్భంగా కిటకిటలాడే లండన్ వీధులు జనాలు లేక వెలవెలబోతున్నాయి. గతేడాది నుంచి వ్యాపారాలు సాగక ఇబ్బందులు పడ్డ రెస్టారెంట్ల యజమానులు ఈ క్రిస్మస్ పై ఎన్నో ఆశలు పెట్టుకోగా.. కరోనా వారి ఆశలపై మళ్లీ నీళ్లు చల్లింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: