ఒమిక్రాన్ : వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఏమ‌న్నారంటే..?

N ANJANEYULU
గ‌త రెండేండ్ల కాలం నుంచి ప్ర‌పంచం మొత్తం గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ తాజాగా నూత‌న వేరియంట్‌గా మారి ఒమిక్రాన్ రూపంలో దూసుకొస్తుంది. తాజాగా ఒమిక్రాన్ ప్ర‌పంచాన్ని భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో పుట్టికొచ్చిన ఈ వైర‌స్ ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 77 దేశాల‌కు పైగా ఈ వైర‌స్ ఎగ‌బాకింది. ఇక భార‌త‌దేశంలో  మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు  73 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు మ‌హారాష్ట్ర, ఢిల్లీ, రాజ‌స్థాన్‌, క‌ర్నాట‌క‌, ఏపీ రాష్ట్రాల‌లో కేసులు న‌మోదు కాగా తాజాగా తెలంగాణ‌లోకి కూడా నిన్న ఈ వైర‌స్ ఎంట్రీ ఇచ్చింది.
తెలంగాణ‌లో డిసెంబ‌ర్ 12న విదేశాల నుంచి వ‌చ్చిన వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. ఇద్ద‌రికీ ఒమిక్రాన్ నిర్థార‌ణ అయిన‌ట్టు వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు వెల్ల‌డించారు. తొలుత  మీడియా స‌మావేశంలో తెలంగాణ వైద్యారోగ్య‌శాఖ డీహెచ్ శ్రీ‌నివాస‌రావు ఒమిక్రాన్ పై వివ‌రాలు చెప్పిన ఆ త‌రువాత  కొద్ది సేప‌టికే మంత్రి హ‌రీశ్‌రావు కూడా మాట్లాడారు. ముఖ్యంగా కెన్యా దేశానికి చెందిన 24 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు క‌లిగిన యువ‌తి, సోమాలియా దేశానికి చెందిన 23 ఏళ్ల యువ‌కుడు ఈనెల 12వ తేదీన వేర్వేరు విమానాల‌లో అబుదాబీ, ఖ‌తార్ మీదుగా శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. అయితే వీరిద్ద‌రికీ ఎలాంటి ల‌క్ష‌ణాలు కూడా లేవ‌ని వెల్ల‌డిఅయింది.  
అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో నిర్వ‌హించిన ఆర్టీసీఆర్ ప‌రీక్ష‌లో వీరిద్ద‌రికీ క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో.. వీరి న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ పంపించ‌గా ఆ ఫ‌లితాల‌లో ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింద‌ని మంత్రి  చెప్పారు. వీరిద్ద‌రూ కూడా హైద‌రాబాద్ న‌గ‌రంలో టోలిచౌకి ప్రాంతానికి చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. వీరిద్ద‌రితో పాటు మ‌రొక బాలునికి కూడా ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. అయితే ఆ బాలుడు విమాన‌శ్ర‌యం నుంచి నేరుగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప‌శ్చిమ‌బెంగాల్‌కు వెళ్లిన‌ట్టు చెప్పారు.
ఒమిక్రాన్‌ వేరియంట్  మూలంగా ఎలాంటి ప్రాణభయం లేదని తెలంగాణ‌  వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు  వెల్ల‌డించారు. రాష్ట్రంలో రెండు కేసులు నమోదు అయ్యాయ‌ని.. ఇప్ప‌టికైనా  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎవ‌రూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని, తగిన జాగ్రత్తలు పాటించితే స‌రిపోతుంద‌ని చెప్పారు. ముఖ్యంగా  18 సంవత్స‌రాలు నిండిన‌ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి హ‌రీశ్‌.  తెలంగాణ‌లో ఇప్ప‌టికే తొలిడోస్  98 శాతం పూర్తయిందని, రెండో డోస్‌ దాదాపు 64 శాతం పూర్తయిందని వివ‌రించారు. ఇప్ప‌టికే బూస్టర్‌ డోస్‌ వేయడంపై కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు.  ముఖ్యంగా రాష్ట్రంలో  కరోనా పరీక్షల సంఖ్య పెంచామని, ముందస్తుగా 21 లక్షల ఐసొలేషన్‌ కిట్లు సిద్ధం చేసామని చెప్పారు. ప్రభుత్వ ఆసుప‌త్రిలో 25,390 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం  క‌ల్పించిన‌ట్టు తెలిపారు. ముఖ్యంగా ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని, భౌతిక‌దూరం, వ్య‌క్తిత శుభ్ర‌త త‌ప్ప‌కుండా పాటించాల‌ని మంత్రి హ‌రీశ్‌రావు సూచ‌న‌లు చేసారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: