మహిళా పోలీసులకు జగన్ శుభవార్త..

Deekshitha Reddy
ఏపీ సీఎం జగన్ పరిపాలనలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నారు. ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నడిపిస్తూనే, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రధానంగా పరిపాలనలో గ్రామ, వార్డు స్థాయి సచివాలయాల వ్యవస్థ కారణంగా పరిపాలన తీరు మొత్తం ఇప్పటికే మారిపోయింది. గతంలో ఏ పని కావాలన్నా అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సివచ్చేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా వరకూ గ్రామ సచివాలయంలోనే పనులు జరిగిపోతున్నాయి. ఈ గ్రామ సచివాలయాలు అనుబంధంగా మహిళా పోలీసులను కూడా నియమించారు. వీరి ద్వారా గ్రామాల్లోనే సమస్యలను పరిష్కరించేలా ఏర్పాట్లు కూడా చేశారు.
గ్రామ స్థాయిలో ఉండే సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 వేల మంది మహిళా పోలీసులను నియమించారు. వీరందరికీ ఇప్పటికే కానిస్టేబుల్ హోదాను కూడా ప్రభుత్వం కల్పించింది. అయితే ఇప్పుడు ఈ మహిళా పోలీసులకు ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పింది. గ్రామాల్లోనే వీరి అభివృద్ధి ఆగిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సంకల్పించింది. మహిళల రక్షణ కోసం పనిచేసే మహిళా పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం కార్యరూపం దాలిస్తే.. ఇప్పటివరకూ కిందిస్థాయికే పరిమితమైన వీరి సేవలు ఇక నుంచి పై స్థాయిలో కూడా అందుబాటులోకి రానున్నాయి.
మహిళా పోలీసుల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సాధారణ పోలీసులకు సమాంతరంగా ఈ మహిళా పోలీస్ వ్యవస్థను కూడా నడిపించేలా నిర్ణయం ఉండబోతోంది. సాధారణ పోలీసుల మాదిరిగానే వీరికి కూడా ప్రమోషన్స్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణ మహిళా పోలీసులకు వారి పనితీరు, అనుభవాన్నిబట్టి.. హెడ్ కానిస్టేబుల్, దగ్గర నుంచి సీఐ స్థాయి వరకూ పోస్టులను క్రియేట్ చేస్తారు. ఈ ప్రమోషన్స్ విషయంపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. హోంశాఖ ఈ నిర్ణయంపై తుది నిర్ణయం తీసుకొన్న తర్వాత.. ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: