టీకా తీసుకోకుంటే.. జీతాలు, పథకాలు కట్..!

NAGARJUNA NAKKA
కరోనా టీకా నిర్బంధం కాదని.. స్వచ్ఛందమేనని కేంద్రం గతంలోనే పేర్కొంది. అయితే దేశంలోని చాలా స్థానిక సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు టీకాలను తప్పనిసరి చేస్తున్నాయి. టీకా లేకుంటే పథకాలు కట్ చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఒక్కడోసు కూడా తీసుకోని వారికి రేషన్, వంటగ్యాస్, పెట్రోల్ బంద్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. థానె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీకా తీసుకుంటేనే బస్సుల్లోకి అనుమతిస్తున్నారు.
ఇక తమ పరిధిలోని ఉద్యోగులు కరోనా టీకా వేసుకోకపోతే వేతనాలు చెల్లించేది లేదని మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఉద్యోగులకు టీకా వేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినా.. స్పందన అంతంత మాత్రంగానే ఉందని తెలిపింది. అలాగే తొలి డోసు తీసుకొని గడువు పూర్తయినా.. రెండో డోసు వేసుకోని వారికి కూడా జీతాలు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. టీకా డోసులు పూర్తయిన వారు ధ్రువపత్రాల పై అధికారులకు ఇవ్వాలని తెలిపింది.
మరోవైపు దేశంలో 80శాతం మందికి కరోనా టీకా మొదటి డోస్, 39శాతం మందికి రెండు డోసులు ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ నెల 30 నాటికి మొదటి డోసు వేసుకున్న వారి సంఖ్యను 90శాతం తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను టీకా వేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది. అయితే వ్యాక్సినేషన్ లో కొవాగ్జిన్, కోవిషీల్డ్, స్ఫూత్నిక్ వీ టీకాలను ఉపయోగిస్తున్నట్టు తెలిపింది.
భారత్ లో గత 24గంటల్లో 11వేల 271 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదలచేసింది. నిన్న కరోనాతో 285మంది మరణించారని పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 44లక్షల 37వేల 307కు చేరగా.. ఇప్పటి వరకు 4లక్షల 63వేల 530 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 11వేల 376మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో లక్షా 35వేల 918యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇఫ్పటి వరకు 112కోట్ల టీకా డోసులు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: